Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమళ్లీ దద్దరిల్లిన పార్లమెంట్‌

మళ్లీ దద్దరిల్లిన పార్లమెంట్‌

- Advertisement -

– ఎస్‌ఐఆర్‌, ట్రంప్‌ సుంకాల బాదుడుపై చర్చించాలని ప్రతిపక్షాల డిమాండ్‌
– మోడీ సర్కార్‌ మౌనంపై నిలదీత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

బీహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల బాదుడుపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. పార్లమెంట్‌ లోపల, బయట ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన నడుమ మణిపూర్‌కు సంబంధించిన రెండు బడ్జెట్‌ బిల్లులను ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించారు. అలాగే రాజ్యసభలో కోస్టల్‌ షిప్పింగ్‌ బిల్లును ఆమోదించారు.గురువారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్లకార్డులు పట్టుకుని ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని నినాదాల హౌరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఎటువంటి చర్చ లేకుండానే మణిపూర్‌ ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్‌కు సంబంధించిన రెండు బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ తొలుత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ కోస్టల్‌ షిప్పింగ్‌ బిల్లుపై చర్చ జరిగింది. అనంతరం బిల్లును ఆమోదించారు.
పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన
బీహార్‌లో ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గురువారం పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు పట్టుకుని మోడీ ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాధీ, సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌, వి. శివదాసన్‌, డీఎంకెే ఎంపీ కనిమొళి, ఎ.రాజా, ఎస్‌పీ ఎంపి సుప్రియా సులే, ఎన్‌సీపీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌, ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ కుమార్‌ ఝా ఇతర ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితాను సవరించి ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని మండిపడ్డారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వలస కూలీలను అరెస్టు చేయడంపై కూడా ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ విషయంలో తన ముఖ్యమంత్రులను నియంత్రించాలని అన్నారు.
విదేశాంగ విధానంలో మోడీ ప్రభుత్వం ఫెయిల్‌ : మల్లికార్జున ఖర్గే
ట్రంప్‌ 50 శాతం సుంకాలు విధించడంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. సుంకాలు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం వైఫల్యంగా పేర్కొన్నారు. భారత దౌత్యం బలహీనంగా, గందరగోళంగా కనిపిస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ చర్యలు తీసుకున్నారన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రధాని మోడీ పూర్తిగా విఫలమయ్యారని, ట్రంప్‌ నిరంతరం భారత్‌పై ఒత్తిడిని తీసుకువస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img