చర్చకు ప్రతిపక్షాలు పట్టు.. సిద్ధపడని ప్రభుత్వం
లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లిన విపక్ష ఎంపీలు
సర్‌కు వ్యతిరేకంగా నినాదాలు
రాజ్యసభలో వాకౌట్
ఆందోళన మధ్యే మణిపూర్ జీఎస్టీ బిల్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
శీతాకాల సమావేశాలను ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కుదించిన కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంటు కార్యకలాపాలను శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లడం లో ఆసక్తి చూపడంలేదని మొదటిరోజు నుంచే స్పష్టమైంది. దేశవ్యాప్తంగా పలు విమర్శలకు గురైన ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై అత్యవసర చర్చ జరపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించడంతో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సహేతుకమైన డిమాండ్‌కు సానుకూలంగా స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ధిక్కార వైఖరిని అవలంబించింది. ఫలితంగా లోక్‌సభ పూర్తిగా స్తంభించిపోయింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటు శీతా కాల సమావేశాలు.. సర్‌పై ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరి ల్లింది. లోక్‌సభ వాయిదాల పర్వం తొక్కింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు.. ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోక్‌సభ సంతాపం ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. సర్‌పై చర్చించాలని పట్టుబడుతూ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో దూసుకెళ్లారు. చర్చకు ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో వెల్‌లోనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సర్ పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ నినాదాలు హోరెత్తించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దంటూ గొంతెత్తారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. ”ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్‌కు పంపింది నినాదాలు, ఆందోళనలు చేయడానికి కాదు. ప్రశ్నోత్తరాలకు ప్రతిపక్షాలు సహకరించాలి” అని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దీంతో సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే 12 గంటలకు వాయిదా వేశారు.
తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన నడుమే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు బిల్లు లను ప్రవేశపెట్టారు. 2025 సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును మంత్రి తీసుకొచ్చారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును సవరించనున్నట్టు మంత్రి వెల్లడించారు. హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లును కూడా నిర్మలా ప్రవేశపెట్టారు. జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం నిధులను పెంచాలని కోరుతూ బిల్లును రూపొం దించారు. మణిపూర్‌కు చెందిన జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. సర్, ఢిల్లీ బాంబు పేలుళ్లు, ఢిల్లీలో కాలుష్యంపై చర్చ జరగాల్సిందేనంటూ ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం ప్రారంభమైన సభలో మణిపూర్ కు చెందిన జీఎస్టీ సవరణ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఆ తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్
రాజ్యసభలో కూడా ప్రతిపక్షాలు సర్ అంశాన్ని లేవనె త్తాయి. చర్చకు ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ప్రతిపక్షాలు రాజ్యసభలో వాకౌట్ చేశాయి. ఉపరాష్ట్రపతిగా సి.పి రాధాకృష్ణన్ రాజ్యసభ చైర్మెన్‌గా తొలిసారి బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయనను సభ స్వాగతించింది. మధ్యాహ్నం తర్వాత సభ తిరిగి ప్రారంభమైన ప్పుడు, ప్రతిపక్షాలు సర్ అంశంపై అత్యవసర చర్చకు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాం డ్‌ను పరిశీలిస్తు న్నామనీ, కానీ అత్య వసరచర్చ సాధ్యంకాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సర్ అంశంపై ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయనీ, చర్చకు అనుమతించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ఖర్గే డిమాండ్ చేశారు.
చైర్మెన్ చైర్‌లో కూర్చున్న సమయంలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే.. రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికారు. ఖర్గే తన ప్రసంగంలో మాజీ చైర్మెన్ జగదీప్ ధన్‌ఖర్ అంశాన్ని ప్రస్తావించారు. జగదీప్ ధన్‌కర్‌కు సరైన రీతిలో ఫేర్‌వెల్ దక్కలేదనీ, దీని పట్ల బాధగా ఉందని ఖర్గే అన్నారు. ధన్‌కర్ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరారు. మల్లికార్జున్‌ఖర్గే ఆరోపణలకు పార్లమెంట్ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ధన్‌ఖర్ రాజీ నామా ఓ పవిత్ర సందర్భమన్నారు. గతంలో ధన్‌ఖర్ పట్ల ప్రతిపక్షాలు అనుచితరీతిలో ప్రవర్తించినట్టు గుర్తుచేశారు.
మోడీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఆగ్రహం
సమావేశానికి ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారు. ”నాటకం ఆడాలనుకునే వారు అలా చేయవచ్చు, కానీ ఇక్కడ నాటకం అవసరం లేదు. నినాదాలు కాదు, విధానాలు గెలవాలి. ఓటమి వల్ల కలిగే భయాందోళన చర్చకు ఆధారం కాకూడదు. ప్రజల అంచనాలకు అనుగుణంగా వ్యవహరించాలి. మన బాధ్యతను నెరy ేర్చాలి” అని మోడీ అన్నారు. మోడీ అపహాస్యంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్‌తో పాటు, లేబర్‌కోడ్‌లు, ఢిల్లీ పేలుళ్లు, ఢిల్లీ కాలుష్యం వంటి అంశాలపై అత్యవసర చర్చలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
అత్యవసర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి : సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
ప్రభుత్వం అత్యవసర చర్చకు సిద్ధంగా ఉండాలని సీపీఐ(ఎం) రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్ డిమాండ్ చేశారు. ”చర్చను ఎవరైనా నిర్వహించవచ్చు. ప్రభుత్వం దాన్ని నిర్ణయించుకోవచ్చు. కావాలనుకుంటే, అది ఎన్నికల సంస్కరణలపై చర్చ కావచ్చు.. ఏదైనా సందర్భంలో, మనం చర్చకు సిద్ధంగా ఉండాలి. సమయం నిర్ణయించాలి” అని జాన్ బ్రిట్టాస్ అన్నారు.
చర్చ కోరితే డ్రామా ఎలా అవుతుంది? : ప్రియాంకాగాంధీ
చట్టసభల్లో డ్రామాలు ఆడవద్దని, టిప్స్ ఇస్తానని ప్రధాని మోడీ విసిరిన వ్యంగ్యాస్త్రాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. సమావేశాల్లో భాగంగా సర్, ఢిల్లీ కాలుష్యం వంటి తీవ్రమైన అంశాలను లేవనెత్తడం డ్రామా ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, సర్, కాలుష్యం వంటివి తీవ్రమైన అంశాలని, వాటిని చర్చిద్దామని ప్రియాంకా గాంధీ అన్నారు. తీవ్రమైన అంశాలపై చర్చ లేకపోతే పార్లమెంట్ దేనికి..? అని ఆమె ప్రశ్నించారు. ఆయా అంశాలపై మాట్లాడటమేమీ డ్రామా కాదనీ, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య చర్చలకు అనుమతించక పోవడమే డ్రామా? అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలపై చర్చించడానికి బదులు మరోసారి నాటకీయ ప్రసంగం చేశారని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు.
రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రేణుకా చౌదరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌కు వచ్చే క్రమంలో తన కారులో ఓ వీధి కుక్కను తనవెంట తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ ఎంపీ డ్రామా ఆడుతున్నట్టు అధికార ఎంపీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రేణుకా చౌదరీ స్పందించారు. సభలో కూర్చున్నవాళ్లు కరుస్తారు కానీ శునకాలు కావని ఆమె అన్నారు. ఓ వీధి కుక్కను వెటర్నరీ క్లినిక్‌కు తీసుకెళ్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రభుత్వానికి జంతువులు అంటే ఇష్టం లేదనీ, వీధి కుక్కలను రక్షించే చట్టాలు లేవని ఆమె అన్నారు. పార్లమెంట్‌లో తనను విడిచిపెట్టిన తర్వాత ఆ శునకాన్ని వెటర్నరీ క్లినిక్‌కు తన డ్రైవర్ తీసుకెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. రేణుక వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ ఎంపీ తమాషా చేస్తున్నట్టు బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ ఆరోపించారు. పార్లమెంట్‌కు శునకాన్ని తీసుకొచ్చి ఆమె ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్టు ఆరోపించారు.



