టీఆర్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్‌కుమార్
నల్గొండ క్లాక్‌టవర్‌కు ‘సామాజిక చైతన్య రథయాత్ర’
నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అసలైన రాజ్యాధికారం దక్కలేదని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక చైతన్య రథ యాత్ర ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ క్లాక్ టవర్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను విడదీసి ఓట్లు దండుకున్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ వర్గాలను వంచించాయన్నారు. ఈ వర్గాల ఐక్యత ద్వారానే అగ్రవర్ణాల ఆధిపత్యానికి చెక్ పెట్టడం సాధ్యమని తెలిపారు. ఆత్మ బలిదానాలు, పోరాటాలతో సాధించిన తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దోపిడే లక్ష్యంగా పాలన చేస్తున్నాయని విమర్శించారు. సామాజిక తెలంగాణ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. యువత మేల్కొని రాజ్యాధికారం దక్కించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లేదంటే పోరాడి సాధించిన తెలంగాణ పరాయి చేతుల్లోనే ఉండిపోతుందన్నారు. నల్గొండ జిల్లా శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికల ముందు ఆయన్ను రాహుల్ గాంధీ స్వయంగా ఆహ్వానించి మంత్రి పదవి ఇస్తానని చెప్పి, వెన్నుపోటు పొడిచారన్నారు. ఆరు నెలల్లో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చటం ఖాయమన్నారు. త్వరలోనే రేవంత్‌రెడ్డి సీఎం పదవి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందన్నారు. 2014 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 100శాతం సీట్లు కేటాయించిన చరిత్ర రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకే దక్కుతుందన్నారు. రాజకీయ చైతన్యం నింపడం కోసం ఈ రథయాత్ర చేపట్టామని తెలిపారు. ”లక్ష్యం” అనే యూట్యూబ్ ఛానల్‌ను కూడా ప్రారంభించినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఛానల్ ద్వారా జాబ్ మేళాలు ఎప్పుడెప్పుడు ఉంటాయో తెలుపుతామని చెప్పారు. తదుపరి జాబ్ మేళాలు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ పట్టణాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జాబ్‌మేళాలో 5,000 మంది పాల్గొనగా, 2,300 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. కేంద్ర స్కిల్ అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రి జనత్ సింగ్ ఆధ్వర్యంలో పలు సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు మల్లేశ్ ముద్దం, రిషబ్ జైస్, జానీ, నరసింహారావు, సుధాకర్, పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నందిపాటి జానయ్య, యాదాద్రి-భువనగిరి అధ్యక్షులు బీరప్ప తదితరులు పాల్గొన్నారు. బుల్లెట్ వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ కళా బందం ప్రదర్శనలు ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీలను విడదీసి వంచిస్తున్న పార్టీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



