నవతెలంగాణ – హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను వారి నివాసంలో పరామర్శించారు. అల్లు అరవింద్ మాతృమూర్తి అల్లు కనకరత్నం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్లి అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చారు.
విషాదంలో ఉన్న అల్లు అరవింద్, అల్లు అర్జున్, ఇతర కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. అల్లు కనకరత్నం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. రాజకీయాల్లో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చి తమను పరామర్శించడం పట్ల అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన ఈ రెండు ప్రముఖ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైంది.