Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్‌సీసీకి బకాయిల్లో సగం చెల్లించండి : హైకోర్టు

ఎన్‌సీసీకి బకాయిల్లో సగం చెల్లించండి : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
మిషన్‌ భగీరథ పనులకు సంబంధించి ఎన్‌సీసీ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన బిల్లుల్లో కనీసం 50 శాతం మొత్తాన్ని ఈనెల 26లోగా చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియాను హైకోర్టు ఆదేశించింది. చెల్లింపులు జరగకపోతే ఈనెల 30న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్‌, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు మిషన్‌ భగీరథ కింద చేపట్టిన తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణ పనులకు సంబంధించిన రూ.180.17 కోట్ల బిల్లులు చెల్లించలేదని ఎన్‌సీసీ లిమిటెడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ టి.మాధవీదేవి విచారణ జరిపి ఈ ఆదేశాలిచ్చారు.

పీజీ సీట్ల భర్తీ గడువు పెంపుపై కేంద్రానికి నోటీసులు
తెలంగాణలోని మెడికల్‌ పీజీ, డిప్లొమా కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గడువు పెంపుపై కేంద్ర ప్రభుత్వం, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పీజీ అడ్మిషన్ల గడువు ముగిసినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 377 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ ప్రయివేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ పిటిషన్‌లో పేర్కొంది. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలంటూ కోర్టును కోరింది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జీఎం. మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపి కేంద్రం వివరణ కోసం కేసును ఈనెల 26కు వాయిదా వేసింది.

గత పోస్టుల్లోనే కొనసాగించాలి
నిమ్స్‌లో క్రమబద్ధీకరించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను వారు పనిచేస్తున్న పోస్టుల్లోనే కొనసాగించాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. అధికారుల ఇష్టానుసారం నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తక్కువ హోదాల్లో నియమించడం సరికాదని పేర్కొంది. గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను వారంలోగా అమలు చేయాలనీ, లేదంటే నిమ్స్‌ డైరెక్టర్‌ ఏప్రిల్‌ 10న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కోర్టు ఉత్తర్వులు అమలు కాలేదని కె.పాపిరెడ్డి, తదితరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి ఈ ఆదేశాలు జారీ చేశారు.

రోడ్డు ఎవరు నిర్మించారో తేల్చండి హైడ్రా కూల్చివేతలపై పిటిషన్‌ పోలీసులకు హైకోర్టు ఆదేశం
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట, బాచుపల్లి పరిధిలోని ఏపీఆర్‌ ప్రణవ్‌ యాంటిల్లా గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద ఏర్పడిన రహదారి నిర్మాణం వెనుక ఎవరున్నారో విచారణ చేసి నివేదిక సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బాచుపల్లి, దుండిగల్‌, జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు దర్యాప్తు జరిపి వివరాలు తెలపాలని సూచించింది. జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటెడ్‌ కమ్యూనిటీలోని కాంపౌండ్‌ గోడను హైడ్రా అధికారులు కూల్చి రహదారి ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ ఏపీఆర్‌ ప్రణవ్‌ యాంటిల్లా వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే తాము రోడ్డు నిర్మించలేదని హైడ్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గతంలో హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులున్నప్పటికీ ఇటీవల కాంపౌండ్‌ కూల్చివేశారని వాదించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత.. ఇంతకీ రోడ్డు ఎవరు నిర్మాణం చేశారో తేల్చి నివేదిక అందజేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను ఏప్రిల్‌ ఏడో తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -