రూపం ఏదైనా కావచ్చు చెప్పే విషయం కవిత్వమైతే పాఠకులు మనసారా ఆదరిస్తారు. వివిధ కవితా ప్రక్రియల్లో గోపి గారి నానీలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి నానీలను ఎందరో కవులు స్పశించారు. 20 నుండి 25 అక్షరాల్లో దాగిన వాటిలోని గాఢత, మెరుపును అందిపుచుకున్నవారు మేలైన నానీలను సజించారు. యువకవి కోవూరి నర్సింలు తన ఆలోచనలను నానీల శిఖరాలుగా మలిచి మన ముందుకొచ్చారు. తాను చెప్పదలచుకున్న విషయాలను సూటిగా, స్పష్టంగా ఎటువంటి అర్భాటం లేకుండా సహజంగా చెబుతారు.
మట్టిలోంచి మొలకెత్తే విత్తనాన్ని దశ్యమానం చేసిన నానీని చూడండి ఎంత సహజంగా చెబుతారో..
”వాన చినుకులతో/ గుండె పగిలిన విత్తనం,/ మొలకై/ నేలను చీల్చింది!”
సీతాకోకను వర్ణిస్తూ ”సీతాకోక చిలుక/ హరివిల్లులా ఉంది,/ రంగులద్దిన/ కుంచె ఎవరిదో” అంటూ అందమైన భావాన్ని చిత్రిస్తారు.
మనిషి ఎంత గొప్పవాడైనా చావు ముందు తల వంచాల్సిందే, అదే సాధ్యం కాని విషయాన్ని ఇలా ప్రశ్నగా సంధిస్తారు.
”మనిషి/ సాధించనిదేముంది,/ కానీ/ చావును ఓడించలేడెందుకు!”
అలాగే మనుషులు స్వార్థ జీవులని ఎదురుగా ఎందరిని జయించినా లోలోపలి స్వార్థం విడనాడటం లేదంటారు.
”ఎదుటి వారిని/ బాగా జయిస్తావు,/ నీలోని స్వార్థం గురించి/ అలోచించావా!”
నేటి కాలపు బంధాలను ఎలా ఉంటాయో గుర్తు చేస్తూ
”కంప్యూటర్/ యుగమిది,/ అంతా వైర్లెస్/ సంబంధాలు కనిపించవు!”
అంటూ పైపై బంధాలు ఎలా ఉంటాయో చక్కగా చెప్పారు.
”అద్దం/ ఒక ప్రతిబింబం,/ మర్యాద కూడా/ ఇచ్చిపుచ్చుకునేదే!” అంటూ మనం అద్దంలో ఏమి చూస్తామో అదే కనబడుతుంది, అలాగే మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అని నొక్కి చెబుతారు.
చిన్న గాలి వీచినా, కాస్త ధూళి సోకినా కళ్ళను రక్షించడానికి రెప్పలు వాటంతట అవే మూసుకుపోతాయి. అదే విషయాన్ని చెబుతూ ”కంటిపాపకు/ కనురెప్ప రక్షణ,/ ఎవరిచ్చారు/ రక్షించమనే శిక్షణ!” అంటూ ఆలోచింపజేస్తారు. చక్కని ప్రాసతో కూడిన నానీ ఇది.
ఇక రాజకీయ నాయకుల మాయ మాటలను నమ్మి ప్రజలెలా మోసపోతారో చెబుతారు.
”నాయకులు/ ప్రజల్ని నమ్మిస్తారు,/ నీళ్ళు లేని చోట/ నిలువెల్లా ముంచుతారు!”
ఇలా తాను గమనించిన ప్రతి అంశాన్ని నానీలుగా మలిచారు. మానవ సంబంధాలను, ప్రకతి దశ్యాలను, సమాజ స్థితిగతులను, రాజకీయ వ్యవస్థను, మనిషి ఎదగవలసిన తీరును, మెలగవలసిన తీరును, పేదల బతుకుదెరువును, ఆకలిని, అమ్మను, జీవితాన్ని, స్నేహాన్ని, సామాజిక విలువలను, గెలుపోటములను, మంచి చెడులను, సైనికులను, రైతును, వ్యవసాయాన్ని, పట్టణాలు పల్లెలను, తెలంగాణ, బతుకమ్మను ఇలా వివిధ విషయాలను నానీల రూపంలో తనదైన శైలిలో ప్రకటిస్తారు.
”ఇంకా తెర తీయని మనసు” కవితా సంపుటితో మన ముందుకు వచ్చి, ఇలా నానీలతో రెండో పుస్తకం తీసుకొచ్చిన మిత్రుడు కోవూరి నర్సింలు ఇలాగే రాస్తూ మరింత భావుకతతో, మరింత మెరుపుతో పదునైన కవిత్వాన్ని మునుముందు అందించగలరని ఆశిస్తున్నాను.
– పుట్టి గిరిధర్ , 9494962080
ఆలోచనా శిఖరాలు – కోవూరి నానీలు
- Advertisement -
- Advertisement -



