నవతెలంగాణ – జోగులాంబ గద్వా
పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను నిబంధనల మేరకు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో భూ-భారతి, మీ – సేవ దరఖాస్తులు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎఫ్-లైన్ పిటిషన్లపై మండలాల వారీగా తహసిల్దార్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
వచ్చిన దరఖాస్తులు ఆరు నెలలు దాటిన వాటిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ల లాగిన్‌లలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భూభారతి దరఖాస్తులలో ప్రభుత్వ భూములు లేదా కాలువలకు సంబంధించిన అంశాలు ఉంటే సర్వేయర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీంచి నివేదిక సమర్పించాలన్నారు.
దరఖాస్తులను తిరస్కరించే ముందు స్పష్టమైన కారణాలను తెలియజేస్తూ రిజెక్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయంలో ఆదాయం, కుటుంబ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్లు నిర్ణీత సమయంలో జారీ చేయాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,పెండింగ్‌లో ఉన్న ఎఫ్-లైన్ పిటిషన్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SSR) ను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. తహసిల్దార్లు తమ పరిధిలోని పాఠశాలలు, వసతి గృహాలను సందర్శిస్తూ ఉండాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాలు అందిస్తున్నారా లేదా పరిశీలిస్తూ ఉండాలన్నారు. విద్యార్థులను సరిగా మార్గనిర్దేశం చేసి చదువులో మంచి ఫలితాలు సాధించే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ. అలివేలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఏడీ రామ్ చందర్, అన్ని మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



