వలసలకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో నిరసనలు
ప్రధాన నగరాల్లో పాల్గొన్న వేలాది మంది
ఆందోళనలను ఖండించిన
అక్కడి రాజకీయ నేతలు
సిడ్నీ : వలసదారులకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో ఆందోళనలు జరిగాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది ఆస్ట్రేలియన్లు ఈ వలస వ్యతిరేక ర్యాలీలలో పాల్గొన్నారు. ముఖ్యంగా భారతీయ వలసదారులే టార్గెట్‌గా ఈ ర్యాలీలలో ఆందోళనకారులు తమ గొంతు వినిపించారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు భారీ మొత్తంలో వలసలు జరుగుతుండటంపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసన ర్యాలీలను ఆస్ట్రేలియాలోని ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఖండించాయి. ఇవి ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని తెలిపాయి. ఇవి ‘నియో-నాజీ’లతో ముడిపడి ఉన్నాయని ఆరోపించాయి.
‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరిట ఈ ర్యాలీలు జరిగాయి. వీటిలో ఆందోళనకారులు భారత సంతతికి చెందినవారిని లక్ష్యంగా చేసుకుంటూ ప్రచారాన్ని జరిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జనాభాల్లో భారత సంతతి జనాభా సంఖ్య మూడు శాతంగా ఉన్నది. గత వందేండ్లలో ఆస్ట్రేలియాకు వలస వచ్చిన గ్రీకులు, ఇటాలియన్ల సంఖ్య కంటే ఐదేండ్లలో ఇక్కడకు వచ్చి, స్థిరపడిన భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉన్నదని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. వలసలు సాంస్కృతిక ప్రభావాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా అంటే అంతర్జాతీయ ఆర్థిఖ వ్యవస్థ ద్వారా దోపిడీకి గురికాబడే ఆర్థిక ప్రాంతం కాదని చెప్పారు.
భారతీయుల జనాభా పెరుగుదలను హైలెట్ చేస్తూ..
ఆస్ట్రేలియాలో పెరుగుతున్న భారతీయుల సంఖ్య గురించి ఈ నిరసన కార్యక్రమానికి ముందు ఫేస్‌బుక్‌లోని జరిపిన ప్రచారంలో పేర్కొన్నారు. 2013 నుంచి 2023 మధ్య వీరి సంఖ్య 8,45,800కు పెరిగిందని జనాభా లెక్కల గణాంకాలను ఉటంకించారు. సామూహిక వలసలు ఆస్ట్రేలియాకు తీవ్ర నష్టాన్ని కలిగించాయని ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ వెబ్‌సైట్ వివరించింది. ఇలాంటి వలసలకు ముగింపు పలకాలంటూ ప్రధాన రాజకీయ నేతలను ఆందోళన నిర్వహించిన గ్రూపు ఎక్స్ వేదికగా డిమాండ్ చేసింది. తమకు ఏ ఇతర గ్రూపులతో సంబంధం లేదనీ, భారీ వలసలకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియన్లను ఏకం చేయాలన్నదే తమ ప్రయత్నమని నిర్వాహకులు వివరించారు.
ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు
ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ ర్యాలీలు జరిగాయి. సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రా, ఇతర నగరాలలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిడ్నీలో జరిగిన ఆందోళన ప్రదర్శనలో నిరసనకారులు జాతీయ జెండాలను చుట్టుకున్నారు. ఈ ప్రదర్శనకు కౌంటర్‌గా శరణార్థులు కార్యచరణ కూటమి ఓ ర్యాలీని నిర్వహించింది. ఇందులో వందలాది మంది పాల్గొన్నారు. తమ కార్యక్రమం ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ తీవ్రవాద ఎజెండా పట్ల తీవ్ర అసహ్యం, ఆగ్రహాన్ని తెలియజేస్తున్నదని కూటమి అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా సిడ్నీవ్యాప్తంగా వందలాది మంది అధికారులను మోహరించామనీ, ఎలాంటి పెద్ద అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. పార్లమెంటుకు మార్చ్ జరపటానికి ముందు మెల్‌బోర్న్‌లో ఫ్లిండర్స్ స్ట్రీట్ స్టేషన్ బయట ఆందోళకారులు గుమిగూడారు. వలసలను ఆపకపోతే మనకు చావు తప్పదని ఆందోళనకారులు అన్నారు. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి.
రాజకీయ వర్గాల నుంచి ఖండనలు
అక్కడి రాజకీయ వర్గాల నుంచి ఈ ర్యాలీలకు వ్యతిరేంగా గళం వినిపించింది. ఫెడరల్ లేబర్ మినిస్టర్ ముర్రే వాట్ ఆందోళనలను ఖండించారు. వీటిని నియో-నాజీ గ్రూపులు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. తమ దేశంలో విభజనకు అవకాశం లేదని ఆ దేశ హోం మంత్రి టోనీ బుర్కే అన్నారు. హింసకు, రేసిజమ్, బెదిరింపులకు ఇక్కడ స్థానం లేదని ప్రతిపక్ష నేత సుస్సాన్ లే ఓ వీడియోలో తెలిపారు.
భారతీయుల్లో ఆందోళన
తాజా నిరసన కార్యక్రమాలు ఆస్ట్రేలియాలోని భారతీయుల్లో ఆందోళన కలిగిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. చదవు, ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్లాలనుకునేవారిపై తాజా పరిణామం ప్రభావం చూపే అవకాశమున్నదని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి నిరసనలు తీవ్రరూపం దాల్చితే, అక్కడి ప్రభుత్వం వలస విధానాలను మార్చే అవకాశాలనూ కొట్టిపారేయలేమని అంటున్నారు.