– స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ రాష్ట్ర సహా సంయోజక్ అశోక్ జీ
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజలు స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు,అమ్మకాలు జరపాలనీ స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ రాష్ట్ర సహా సంయోజక్ అశోక్ జీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో చర్చించారు. ఈ సందర్భంగా సమావేశం అనంతరం స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ రాష్ట్ర సహా సంయోజక్ అశోక్ జీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు తప్పనిసరిగా స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు,అమ్మకాలు చేయాలన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసి ట్రంప్ టారిఫ్ లకు సమాధానమివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా, అమెరికా, టర్కీ బయ్ కాట్ తమ నినాదంగా తీసుకొని దేశభక్తిని చాటాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న ఈ కాలంలో వ్యాపార మార్గాలు, చెల్లింపు విధానాలు, కరెన్సీలు ఆయుధాలుగా మారుతున్నాయన్నారు. అమెరికా పాశ్చాత్య దేశాలు రక్షణాత్మక విధానాలు అవలంబిస్తూ అధిక పన్నులు, అన్యాయ పూర్వక అడ్డంకులతో ప్రపంచ ఎగుమతులను అడ్డుకుంటున్నాయని తెలిపారు. మరోవైపు, చైనా వంటి దేశాలు అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించి అతి తక్కువ ధరలో, నాసిరకం వస్తువులను డంప్ చేస్తూ, మన తయారీ రంగాన్ని బలహీనపరుస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశీ ఆచరణ మన జాతీయ ప్రయోజనాలను కాపాడే ప్రధాన ఆయుధమన్నారు.
అంతే కాకుండా విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, ముఖ్యంగా చైనా, టర్కీ వంటి శత్రుత్వ దేశాల వస్తువులు, సేవలను బహిష్కరించడం, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకు బదులుగా భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, స్థానిక ఉత్పత్తులు, శిల్పులను ప్రోత్సహించడం వంటి చర్యలు అవసరమని గుర్తు చేశారు.ఇవి దేశ ఆర్థిక శక్తిని పెంచి, స్థానిక ఉపాధి, వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహిస్తాయన్నారు.