నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైట్‌హౌస్ ఎదుట కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దుండగులు జరిపిన కాల్పుల్లో వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు సిబ్బంది మృతి చెందారు. మొత్తం ముగ్గురు జవాన్లపై కాల్పులు జరిగాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో జవాను స్వల్పంగా గాయపడ్డాడు.
ఈ సంఘటన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అఫ్గాన్‌తో సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ను సమీక్షించనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రతి విదేశీయుడి గ్రీన్ కార్డును పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాలి” అని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించినట్లు తెలిపారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ అమెరికా సాంకేతికంగా పురోగతి సాధించినప్పటికీ, దాని వలస విధానం చాలా మంది జీవన పరిస్థితుల్ని నాశనం చేసింది’’ అని కామెంట్ చేశారు. బైడెన్ హయాంలో అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తామని చెప్పారు. అమెరికాను ప్రేమించలేని వారిని తొలగిస్తామని, అమెరికాకు చెందని వారి ఫెడరల్ ప్రయోజనాలను, సబ్సిడీలను ఇప్పటికే ముగించానని, పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేని ఏ విదేశీయుడినైనా బహిష్కరిస్తాననని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ఉపయోగం లేని వారిని, హత్యలకు నేరాలకు పాల్పడే వారిని దేశం నుంచి గెంటేస్తామని చెప్పారు.


