Friday, July 25, 2025
E-PAPER
Homeజాతీయంకాసుల పంట కురిపిస్తున్న పీఎస్‌యూలు

కాసుల పంట కురిపిస్తున్న పీఎస్‌యూలు

- Advertisement -

కేంద్రానికి భారీగా డివిడెండ్లు

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూలు) నుంచి కేంద్రం భారీగా డివిడెండ్లు దండుకుంటోంది. గత ఐదు సంవత్సరాల కాలంలో డివిడెండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పొందిన ఆదాయం రెట్టింపైంది. ఇందులో ఎక్కువ మొత్తం ఐదు చమురు, గ్యాస్‌, బొగ్గు కంపెనీల నుంచి వచ్చినదే. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (డీఐపీఏఎం) నుంచి కంపెనీల వారీగా తీసుకున్న వివరాల ప్రకారం 2020-21, 2024-25 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మూడు లక్షల కోట్ల రూపాయల డివిడెండ్లలో రూ.1.27 లక్షల కోట్లు లేదా 42.3 శాతం ఈ ఐదు ఇంధన సంబంధమైన పీఎయస్‌యూల నుంచి వచ్చినవే.
కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా డివిడెండ్లు అందించిన పీయస్‌యూలలో కోల్‌ ఇండియా లిమిటెడ్‌, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), గెయిల్‌ ఇండియా ఉన్నాయి. 2024-25లో కేంద్రానికి కోల్‌ ఇండియా రూ.10,252 కోట్లు, ఓఎన్‌జీసీ రూ.10,002 కోట్లు, బీపీసీఎల్‌ రూ.3,562.47 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాయి. ఇవి కాకుండా రిజర్వ్‌బ్యాంక్‌, జాతీయ బ్యాంకులు కూడా కేంద్రానికి డివిడెండ్లు అందించాయి.
2022-23 నుంచి ఐఓసీ, బీపీసీఎల్‌ కలిసి కేంద్రానికి అందించిన డివిడెండ్లు ఏకంగా 255 శాతం పెరిగాయి. ఈ కాలంలో చమురు ధరలు 65 శాతం తగ్గినప్పటికీ పెట్రోల్‌ ధరలను మాత్రం కేవలం రెండు శాతం మాత్రమే తగ్గించాయి. అంటే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ వినియోగదారులకు ఒరిగింది మాత్రమే శూన్యమేనని అర్థమవుతోంది. చమురు కంపెనీలు పొందుతున్న ఆదాయంలో ఎక్కువ భాగం కేంద్రానికి డివిడెండ్లు చెల్లించడానికే పోతోంది. 2024లో కేంద్ర ప్రభుత్వం డివిడెండ్ల చెల్లింపులకు సంబంధించిన విధానంలో మార్పులు చేసింది. దీని ప్రకారం కేంద్ర పీయస్‌యూలు పన్ను చెల్లింపుల తర్వాత వచ్చిన లాభాలలో (పీఏటీ) కనీసం 30 శాతం లేదా నికర విలువలో నాలుగు శాతం…ఏది ఎక్కువైతే దానిని డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. పెట్టుబడుల ఉపసంహరణ, డివిడెండ్ల మధ్య సమతూకాన్ని పాటించడం కోసం ఈ మార్పు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కోవిడ్‌ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడుల ఉపసంహరణ విధానం ఇప్పటికీ అమలులోనే ఉన్నదని, అయితే ప్రారంభంలో ఆశించినట్లు అది పురోగతి సాధించడం లేదని అధికారులు చెప్పారు. అదే సమయంలో అనేక పీయస్‌యూలు లాభాలతో దూసుకుపోతున్నాయని, దీంతో వాటి నుంచి పొందే డివిడెండ్లను ప్రభుత్వం గరిష్ట స్థాయిలో పెంచిందని ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -