– పిటిషనర్‌కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ
– గతంలో భూవివాదం కేసులో సీఎంపై పెద్దిరాజు పిటిషన్ దాఖలు
– 11లోగా రాతపూర్వక వివరణ కోరిన ధర్మాసనం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ సిట్టింగ్ జడ్జిపై అసభ్యకర ఆరోపణలు చేసినందుకు పిటిషనర్, ఆయన తరపు న్యాయవాదిపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జిలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని పేర్కొంది. సోసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారని 2016 లో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్యలపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఎన్. పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల అనంతరం ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున రేవంత్ రెడ్డిపై దాఖలైన కేసును కొట్టివేసింది. అయితే… ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఈ నెల 12న పెద్దిరాజు తరఫున ఏఓఆర్ రితేశ్ పాటిల్ సుప్రీంకోర్టులో ట్రాఫర్ పిటిషన్ (క్రిమినల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, పిటిషనర్ పెద్దిరాజ్ తరపు నితిన్ మిశ్రాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ… ‘హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై అసభ్యకర ఆరోపణలు చేసినందుకు పిటిషనర్‌కు కోర్టు ధిక్కార నోటీసులు పంపిస్తాం’ అని పేర్కొంది. దీంతో ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించినప్పటికీ, ఇదే రీతిలో నమోదైన కోర్టు ధిక్కార కేసు ఎంవై షరీఫ్ వర్సెస్ నాగ్‌పూర్ కేసును ఉదహరించి, ఉపసంహరణ కుదరదని తేల్చి చెప్పింది. మరోవైపు హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగిన తీరు, అనంతరం తీర్పులోని ముఖ్యాంశాలను లూత్రా ధర్మాసనానికి నివేదించారు.
జడ్జిలను బోన్‌లో నిలబెడతామంటే ఊరుకోం..
అనంతరం పిటిషన్‌పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సిట్టింగ్ జడ్జిపై అసభ్యకరమైన ఆరోపణలు చేస్తూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, కనీసం ఇలాంటి పిటిషన్ వేసే ముందు న్యాయవాది సరిచూసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది. అందువల్ల పిటిషనర్ పెద్దిరాజుతో పాటు, ఏఓఆర్ రితేష్ పాటిల్, న్యాయవాదులకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడిచింది. ఇందుకు ప్రతిగా పిటిషనర్ తరపు న్యాయవాది నితిన్ మిశ్రా కోర్టును క్షమాపణలు కోరారు. ఈ క్షమాపణలను పరిగణలోకి తీసుకోబోమని,వారం రోజుల్లో ముగ్గురు రాతపూర్వకంగా సమాధానమివ్వాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆగస్టు 11న ముగ్గురు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలాగే ఎన్. పెద్దిరాజు వేసిన ట్రాఫర్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.
తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై అసత్య ఆరోపణలతో సుప్రీంలో పిటిషన్
- Advertisement -
- Advertisement -