నవతెలంగాణ హైదరాబాద్: రివ్యూ పిటిషన్‌లో తీర్పు వెలువరించట్లేదంటూ… కోర్టు హాలులోనే న్యాయమూర్తి పట్ల పిటిషనర్ దురుసుగా ప్రవర్తించాడు. ఈ సంఘటన గురువారం హైకోర్టులో చోటుచేసుకుంది. ఒక సివిల్ వివాదంపై అంబర్‌పేటకు చెందిన బి.చెన్నకృష్ణారెడ్డి హైకోర్టులో అప్పీలు దాఖలు చేసి స్టే పొందారు. 18 ఏండ్ల తరువాత దీనిపై విచారించిన జస్టిస్ నగేశ్ భీమపాక అప్పీలును కొట్టివేయగా, కక్షిదారు మరోసారి రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల చెన్నకృష్ణారెడ్డి.. అనుమతి లేకుండా నేరుగా న్యాయమూర్తి ఛాంబర్‌లోకి వెళ్లి ‘అప్పీల్‌ను ఎలా కొట్టివేస్తారు, రివ్యూ పిటిషన్‌లో ఎందుకు తీర్పు ఇవ్వర’ని ప్రశ్నించారు.
న్యాయమూర్తి ఛాంబర్‌లోకి పిటిషనర్ రాకూడదని, కేసు గురించి మాట్లాడకూడదని జడ్జి వారిస్తున్నా.. చెన్నకృష్ణారెడ్డి దురుసుగా వ్యవహరించారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేసును ఓపెన్ కోర్టులో వింటానని ఆయనను బయటికి పంపి గురువారం విచారణ చేపట్టారు. కేసును తనకు తానే వాదించుకుంటున్న చెన్నకృష్ణారెడ్డి రివ్యూ పిటిషన్‌లో ఎందుకు తీర్పు వెలువరించరంటూ న్యాయమూర్తినే ప్రశ్నించారు. తన రివ్యూ పిటిషన్‌లో ఉత్తర్వులు జారీ చేయాలంటూ బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కక్షిదారు వయసు రీత్యా దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించడం లేదని, ఈ కేసు విచారణ నుంచి తాను వైదొలుగుతున్నానని ప్రకటించారు. ఈ ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.