Tuesday, July 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం

- Advertisement -

– ఆగస్టు 1న జిల్లా కేంద్రాల్లో ధర్నా
– 23న హైదరాబాద్‌లో మహాధర్నా
– బదిలీలు, పదోన్నతులు నెలాఖరులోగా చేపట్టాలి
– పైరవీ డిప్యూటేషన్లను రద్దు చేయాలి
– టీచర్ల సర్దుబాటు జీవోను సవరించాలి : యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్‌ కార్యాలయంలో ఎం సోమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావ రవి, ఎ వెంకట్‌, చకినాల అనిల్‌కుమార్‌, నన్నెబోయిన తిరుపతి, టి లింగారెడ్డి, ఎస్‌ హరికిషన్‌, బి కొండయ్య, ఎం సైదులు, డి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. మ్యానిఫెస్టోలో పొందుపరచిన ఎన్నికల హామీలను అమలు పరచడం లేదని తెలిపారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేసి, ఈ నెలాఖరులోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. నూతన జిల్లాల కు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, పెన్షనర్ల వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలి డిమాండ్‌ చేశారు. ప్రాథమిక పాఠశాలలకు 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలని కోరారు. డీఎడ్‌, బీఎడ్‌ అర్హతలున్న ప్రతి ఎస్జీటీకి పీఎస్‌్‌హెచ్‌ఎం పదోన్నతికి అవకాశం కల్పించాలని తెలిపారు. పండిట్‌, పీఈటీల అప్‌గ్రెడేషన్‌ ప్రక్రియ పూర్తి అయినందున రెండు, మూడు, తొమ్మిది, పది జీవోలను రద్దు చేసి 11,12 జీవోల ప్రకారం పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని డిమాండ్‌ చేశారు. వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గురుకుల టైం టేబుల్‌ను సవరించాలనీ, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలోని టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి అనేకసార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికీ, మంత్రులు, అధికారుల కమిటీలు వేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని తీర్మానించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని కోరారు.


ఉద్యమ కార్యాచరణ
– ఈనెల 23, 24 తేదీల్లో మండల తహసీల్దార్ల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మెమోరాండాలు సమర్పణ
– ఆగస్టు ఒకటో తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు
– ఆగస్టు 23న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి మహాధర్నా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -