హైదరాబాద్ మహానగరంలో డ్రెయినేజీ సమస్య రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎక్కడపడితే అక్కడే రోడ్లపై మురుగునీరు పారుతుండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా జీహెచ్‌ఎంసీ దృష్టి సారించడం లేదు. వర్షాకాలంలో ఇది మామూలే కదా అన్న ధోరణిలోనే వ్యవహరిస్తుంది. అధికారులకు సమస్యల పట్ల ఎవరైనా ప్రజలు ఆన్‌లైన్‌లో ఫోన్‌చేసి ఫిర్యాదు చేద్దామన్నా కనీసం వినేందుకు కూడా సిద్ధపడటం లేదు. చినుకు పడిందంటే చాలు, కాలనీల్లో డ్రెయినేజీలు పొంగి పొర్లుతున్నాయి. నీరంతా ఇండ్ల ముందే నిలువ ఉంటున్నది. క్లియర్ చేయమని అధికారులకు చెప్పినా వారు స్పందించడం లేదు. ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్లే మెయిన్‌రోడ్డు, ఇతర పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. హెచ్‌ఎండబ్ల్యూఎస్ వారు మామూళ్లు ఇస్తేనే శుభ్రం చేస్తున్నారు.
ఒక్క డ్రెయినేజీ క్లీన్ చేయడానికి రూ.500 నుంచి వెయ్యి దాకా వసూలు చేస్తున్నారు. ఈ సమస్య అంబర్‌పేట్, రాంగనర్, విద్యానగర్, నల్లకుంటలో మరీ ఎక్కువగా ఉంది. పైగా గవర్నమెంట్‌కు చెందినవారం కాదని, ప్రయివేటు వాళ్లమని నమ్మిస్తూ డబ్బులు లాగుతున్నారు. కానీ వారంతా గవర్నమెంట్ ఆదీనంలో పనిచేస్తున్నవారే. మామూళ్లు ఇవ్వడం లేదంటే వారంపాటు కంప్లయింట్‌ను స్వీకరిం చకుండా ఏవో కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఉప్పల్ ప్రాంతంలో మురుగునీటి సమస్యపై స్థానిక కార్పొరేటర్‌కు విన్నవించినా ఫలితం లేదు. డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎన్నిసార్లు విన్నవించినా కాలనీవాసుల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోతుంది తప్ప పట్టించుకునే వారు లేరు. ఇంటిపన్ను, నల్లాపన్ను, విద్యుత్ బిల్లు సకాలంలో కట్టకుంటే అధికారులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు.
డ్రెయినేజీ సమస్య, లేదంటే నీటి సమస్య ఉందంటే మాత్రం రేపు,మాపు అంటూ కాలయాపన చేస్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం పర్యటించే రాష్ట్ర రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? పైగా ఈ రోడ్లపై పాచ్ వర్క్ చేయించకపోవడతో వర్షాలకు గుంతలుగా మారి అనేక యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఇటీవల ఓ నిండుగర్భిణి ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి వెళ్తూ ఈ గుంతల వల్ల చాలా అవస్త పడినట్టు తెలిసింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, స్కూల్ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు ఈ గుంతల వల్ల నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఉప్పల్-బోడుప్పల్ ప్రాంతాల్లో మురుగునీరు నిలువకుండా డ్రెయినేజీలను క్లియర్ చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్,
9490300867



