నవతెలంగాణ ఢిల్లీ: మరికొన్ని రోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే ఎస్‌సీఓ సదస్సుకు ప్రధాని హాజరుకానున్నట్లు సమాచారం. ఆగస్టు 31-సెప్టెంబరు 1 తేదీల్లో తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ భేటీలో మోడీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇతర దేశాధినేతలు పాల్గోనున్నట్టు సమాచారం. బీజింగ్ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశాధినేతలిద్దరూ గతేడాది అక్టోబరులో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ముఖాముఖీగా సమావేశమైన సంగతి తెలిసిందే.
2020 తర్వాత నుంచి మోడీ చైనాకు వెళ్లడం మళ్లీ ఇప్పుడే కానుంది. తొలిసారిగా 2015లో బీజింగ్‌కు వెళ్లిన భారత ప్రధాని.. ఇప్పటివరకు ఐదుసార్లు ఆ దేశంలో పర్యటించారు. అయితే, ఐదేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరుదేశాల మధ్య సైనికుల ఘర్షణతో సంబంధాలు దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటించి జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాల గురించి వీరివురూ చర్చించారు.