నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడి లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ (LNJP) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని నరేంద్రమోదీ పరామర్శించారు. రెండు రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని రాగానే ప్రధాని నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఒక్కొక్కరిని కలిసి మాట్లాడారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఆ తర్వాత ప్రధాని ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనపై సమగ్ర వివరాలను తెలుసుకోనున్నారు. పేలుడు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించనున్నారు.
కాగా గత సోమవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఓ I20 కారులో భారీ పేలుడు సంభవించింది.
ఈ పేలుడులో అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 12 కు చేరింది. ఈ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి అస్సాం పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.




