నవతెలంగాణ-హైదరాబాద్: పోక్సో కేసులో కర్నాటకలోని మంగుళూరు కోర్టు 51 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించింది. 13 ఏళ్ల మైనర్ బాలికను హత్యాచారం చేసిన కేసులో కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కేఎస్ మన్నూ శుక్రవారం నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
నిందితుడు ఫకీరప్ప హనుమప్ప మదరపై పలు కేసులు ఉన్నాయి. బెల్గావి జిల్లాలోని సావదత్తి తాలూకాలోని హంచినాల్ గ్రామం అతని స్వస్థలం. 2024, ఆగస్టు 6వ తేదీన మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిపై ఎవరూ లేని సమయంలో నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై హత్యచేశాడు. ఈ ఘటన పన్నంబుర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 103(1) కింద నిందితుడికి మరణశిక్షతోపాటు బీఎన్‌ఎస్‌లోని 332(ఏ) సెక్షన్ కింద జీవితకాల శిక్షను వేశారు. పోక్సో చట్టం కింద 50వేల జరిమానా విధించారు.