Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజకవిత్వ, వచన రచనలు - జాగ్రత్తలు

కవిత్వ, వచన రచనలు – జాగ్రత్తలు

- Advertisement -

శీర్షికలో చెప్పిన రెండు ప్రక్రియలలో ఎదురయ్యే ఇబ్బందులను క్లుప్తంగా వివరించడం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. సాదాసీదా ఉటంకింపులను (plain statements)పొందుపరచిన సాధారణ వాక్యాలను కవితా పంక్తులుగా భావించలేము. వాటిలో ఏదో విధమైన కవిత్వస్పర్శ ఉండాలి. అది లేనప్పుడు వాటిని ఆసక్తికరమైన వాక్యాలు అనో, ఆలోచింపజేసే వాక్యాలు అనో మాత్రమే వర్ణించగలం. వాటిలో విలువైన జీవిత సత్యాలు ఉంటే ఉండవచ్చు. అది వేరే సంగతి.

జీవితంలో కష్టమూ ఉంటుంది సుఖమూ ఉంటుంది. కష్టపడకుండా సుఖాన్ని మాత్రమే ఆశించడం అజ్ఞానానికి సూచిక. దేవుడా, అటువంటి వథా జీవితం నాకు వద్దు, ఒక జీవిత సత్యానికి సంబంధించిన statement తప్ప ఇందులో కవిత్వం లేదు. పైగా ఇది శుద్ధ వచనం. అది కూడా కవిత్వస్పర్శ లేని వచనం. వచనం అంటేనే కవిత్వం కానిది అని అంటున్నప్పుడు ‘కవిత్వ స్పర్శ లేని వచనం’ ఏమిటి, అనే సందేహం కలుగవచ్చు. కానీ, కవిత్వ స్పర్శ ఉన్న వచనం ఉంటుంది. అదే ప్రోజ్‌ పోయెం. దీన్ని విపులంగా వివరిస్తే మరో పెద్ద వ్యాసం అవుతుంది. ఇక, పైన ఇచ్చిన మూడు లైన్లను (నిజానికి అవి prose sentences),), ”అగాథమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే, శోకాల అడుగున దాగి సుఖమున్నదిలే” అనే శ్రీశ్రీ పాటలోని పంక్తులతో పోల్చిచూస్తే అంతరం అవగాహనకు వస్తుంది. భావం ప్రకారం రెండింటి మధ్య పెద్దగా భేదం లేదు. ఐనా రెండవదానిలో కవిత్వస్పర్శ ఉంది, మొదటిదానిలో అది పూర్తిగా మగ్యం. ఐతే, ఆ వాక్యాలలోని భావం నచ్చి, మెచ్చుకునేవాళ్లు చాలా మందే ఉండవచ్చు. కానీ, వస్తువును కవిత్వం చేయడమన్నది శ్రీశ్రీ పంక్తులలోనే ఉంది, ఆ మూడు వాక్యాలలో లేదు. కవిత్వంలో పదాలకన్న భావమే ముఖ్యం అనే వ్యాఖ్య ఒక స్థాయిలో లేదా కోణంలో సరైనదే ఐనా, ఏ పదాన్ని వాడినా పెద్దగా భేదం ఉండదు అని చెప్పలేము. ఎందుకంటే, సాధారణమైన భావవ్యక్తీకరణ కవిత్వం కాదు మరి! ప్రత్యేకమైన లేదా విశిష్టమైన భావవ్యక్తీకరణ మాత్రమే కవిత్వం. దానికి ప్రత్యేకమైన డిక్షన్‌ (కవిత్వ భాష) ఒకటి అవసరం. పదాలు లేకుండా డిక్షన్‌ ఉండదు. భావం గొప్పగా ఉండటంతో పాటు ఆ భావాన్ని కవితాత్మకంగా ఉద్దీపింపజేసే భాష కవిత్వానికి అవసరం. మరోవిధంగా చెప్పపాలంటే, ఒక ఊహను వ్యక్తీకరించేందుకు ఎటువంటి భాషను తొడుగుతున్నామన్నది ముఖ్యమౌతుంది. ఇక్కడ భాష అంటే మళ్లీ పదాలే. ప్రౌఢమైన పదాలు మాత్రమే కవిత్వాన్ని ఉద్దీపింపజేయగలవు అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. మరో విషయమేమంటే, పనితనం (craftsmanship or workmanship) లోపిస్తే కవిత ఉన్నత స్థాయిలో నిలువదు. కవిత్వ భాష అంటూ వేరే ఉండదని అంటారు కొందరు. కానీ, పైన ఇచ్చిన శ్రీశ్రీ ‘పంక్తులకూ’ మొదట ఇచ్చిన మూడు ‘వాక్యాలకు’ మధ్య ఉన్న భేదాన్ని పరిశీలిస్తే, ప్రత్యేకమైన కవిత్వ భాష అనేది ఉంటుందనే విషయం ఆకళింపునకు వస్తుంది. ఏ భాష ఐతే కవిత్వానికి సంబంధించిన అనుభవాన్ని ఉద్దీపింపజేస్తుందో దాన్నే కవిత్వ భాష అనవచ్చు.

వ్యాసం రాయాలంటే మొదట అనిపించేది, ‘అబ్బా, ఎన్నో వాక్యాలను రాయాలి కదా,’ అని! సమీక్ష, ముందుమాట మొదలైనవాటికి పుస్తకం రూపంలో ఒక ఆధారం ఉంటుంది. అనువాదానికేమో మూలరచన ఉంటుంది. కానీ స్వతంత్ర వ్యాసం కోసం రాసే వాక్యాలు కవిత్వంలో లాగా పూర్తిగా మనవై ఉండాలి – లోపల ఉటంకించిన పంక్తులు, వాక్యాలు తప్ప. ఇది కాకుండా syntax(వాక్యనిర్మాణం) పరిపూర్ణంగా ఉండాలి. రాసేదాంట్లో భాషాదోషాల గురించిన బాధ, వాక్యాలు కుదురుగా ఆకర్షణీయంగా ((appealing)) తయారు కావాలనే ఆదుర్దా, తపన కొంచెం ఆందోళనను కలిగిస్తాయి. కళావిహీనమైన వాక్యాలు (lackluster sentences) లేకుండా చూసుకోవడం తక్కువ ముఖ్యమైనదేం కాదు.
వాక్యాన్ని రాయడం గురించి ఇంతగా సతమతమయ్యేదేముంటుంది, అనిపించవచ్చు. కానీ కర్త, క్రియ, అవ్యయం, విశేషణం లాంటి భాషాభాగాలు సరైన స్థానాల్లో ఉన్నాయా, భావం సరిగ్గా ద్యోతకమవుతున్నదా లేక అయోమయం చోటు చేసుకుంటున్నదా అని నిర్ధారించుకోవడం కోసం ఒక్కొక్క వాక్యం మీద మనసు పెట్టి శ్రద్ధతో విడివిడిగా పరిశీలించాలి. ఫలానా మాట మనసులోని ఉద్దేశాన్ని కచ్చితత్వంతో ప్రతిబింబిస్తున్నదా లేక మరింత ఎక్కువగా సరిపోయే, ప్రభావవంతమైన పదం వేరొకటి ఉన్నదా అని ఆలోచించాలి. సాధ్యమైనంత వరకు భిన్నమైన అర్థం రాకుండా పదాలను ఎన్నుకోవాలి. ఒక శబ్దానికి రెండు మూడు భిన్నమైన అర్థాలుండే సందర్భాలుంటాయి కొన్ని. అలాంటి పదాలను వాడినప్పుడు, ఆ సందర్భం ప్రకారం ధ్వనించే అర్థాన్ని తప్ప వేరేదాన్ని ఎలా ఊహించుకోగలం అని వాదించవచ్చు ఎవరైనా. అయినప్పటికీ, ఒకవేళ సరిగ్గా మ్యాచ్‌ అయ్యే ఒకే అర్థాన్ని కలిగిన పదం ఉంటే, దానివైపే మొగ్గు చూపడం నయం అనిపిస్తుంది. ఉదాహరణకు, పొరుగుదేశం పట్ల మనం ఎంతో సంయమనాన్ని పాటించినా అది సత్ఫలితాలను ఇవ్వలేదు అని గ్రహించాం, అనే వాక్యాన్ని పరిశీలిస్తే ఇందులోని ‘ఇవ్వలేదు’కు రెండర్థాలు స్ఫురిస్తాయి: అవి did not give, cannot give.. కాబట్టి, మన అసలు ఉద్దేశంdid not give ఐతే ఇవ్వలేదు అనీ, cannot give ఐతే ఇవ్వజాలదు అనీ రాసి అనిశ్చితిని తొలగించవచ్చు.
వాక్యాలను నిర్దిష్టంగా, నిర్దుష్టంగా రూపొందించడాన్ని ముత్యాలను శుభ్రపరచడంతో పోల్చవచ్చునేమో. చారెడు ముత్యాలను ఒక గిన్నెలో పోసి నల్లా కింద ఆదరబాదరగా కడగటం వేరు, ఒక్కో ముత్యాన్ని విడివిడిగా కడిగి, పొడిగుడ్డతో తుడిచి శుభ్రపరచడం వేరు. ఇదిగో, ఈ శ్రమ గుర్తుకు వచ్చినందుకే మనసు అలా గుబగుబలాడుతుంది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని రాసింతర్వాత అచ్చురూపంలో వచ్చినదాన్ని చదివితే పూర్తిగా సంతప్తి దొరుకుతుందా అంటే అదేం లేదు. మళ్లీ ఏదో ఒక పదం గురించిన, లేదా సింటాక్స్‌ గురించిన అసంతప్తి లోపల చిన్నగా వేధిస్తూనే ఉంటుంది! కాబట్టి ఎంత ఎక్కువగా చెక్‌ చేసుకుని సవరణలు చేసుకుంటే అంత మంచిది.

– ఎలనాగ

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad