వరుసగా నాలుగు నెలల పాటు ప్రజల్లోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
నేడు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి యాత్రకు ప్రయాణం
సొంత జిల్లా నిజామాబాద్ నుంచి జాగృతి జనంబాట యాత్ర షురూ
నవతెలంగాణ – హైదరాబాద్:
పుట్టుక నీది, చావు నీది. బతుకంతా దేశానిది అన్నారు సుప్రసిద్ధ కవి కాళోజీ. ఆ మాటల స్ఫూర్తిని అక్షరాల ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు కల్వకుంట్ల కవిత. తన బతుకంతా తెలంగాణకే అంకితం అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూన్న రోజుల్లో స్వరాష్ట్ర సాధన పోరాటంలోకి వచ్చారు కవిత. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కవిత కృషి చేశారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో కవిత సాగించిన కృషి ప్రతి ఒక్కరి కళ్ల ముందు ఉన్నది. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి నడిచిన కవిత స్వరాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, సబ్బండ వర్గాలకు అండగా నిలిచేందుకు తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబోయే నాలుగు నెలల ప్రజల్లోనే ఉండనున్నారు. వారి కష్టాలు, సమస్యలను దగ్గరి నుంచి చూసి తెలుసుకోనున్నారు. జాగృతి జనంబాట యాత్ర తన సొంత జిల్లా నిజామాబాద్ నుంచి ఆమె ప్రారంభించనున్నారు.
జనం కోసం, జనం చేత, జనం కొరకు ఆమె జనం బాటకు సిద్ధమయ్యారు. అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే మనం వారికోసం చేయాలని ఆమె డిసైడయ్యారు. ఏదైనా ఒక పని పట్టుకుంటే దాని అంతుచూసే వరకు వదలని వ్యక్తిత్వం కవితది. తెలంగాణ జాగృతి ద్వారా ఎన్నో ప్రజా సమస్యలను ఎత్తుకొని వాటి పరిష్కారమయ్యే వరకు రాజీ లేని పోరాటం చేశారామె. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ఆకాంక్షలు అనుకున్న స్థాయిలో నెరవేరలేదని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాను సిద్ధమయ్యారు. ఇక తన బాట తెలంగాణ జనం బాటేనని ఫిక్స్ అయ్యారు. కాళోజీ చెప్పినట్లు ఇక బతుకంతా తెలంగాణ కోసమేనని సంసిద్దులయ్యారు.
ఈ బాటలో పూలు పడినా, రాళ్లు పడినా అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయటమేనని ఆమె గట్టిగా నిర్ణయించుకున్నారు. తన గమ్యం కోసం అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టి పోరాడాల్సి వస్తే అందుకు కూడా సిద్ధమేనని ఆమె చెబుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల విషయంలో కవిత గట్టి సంకల్పంతో ఉన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ తో, తన కుటుంబ సభ్యులతో విబేధాలు తలెత్తిన సరే ఆమె లెక్క చేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు కచ్చితంగా మేలు జరగాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే తెలంగాణ ఆకాంక్షలు అంటే మనకు మనం అనుకునేవి కాదని కవిత భావిస్తున్నారు. అది మారుమూల ప్రాంతంలోని ఓ అవ్వ నుంచి సిటీ లో ఉండే మేధావి వర్గం వరకు అందరి ఆకాంక్షలనే తెలంగాణ ఆకాంక్షలుగా పరిగణించాలని కవిత భావిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతంలో సామాజిక అంశాల అధ్యయన యాత్రగా ఈ పర్యటన సాగనున్నది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత ఆమె కొత్త పార్టీ పెడతారని చాలా మంది భావించారు. కానీ కవిత మాత్రం తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే కార్యక్రమం చేపట్టారు. ప్రజలే గురువులని భావిస్తున్న ఆమె ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నాకే రాజకీయంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అందుకే తాను ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
అయితే కవిత జనంబాట మీద చాలా మంది చాలా రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు జనం బాట సక్సెస్ అవుతుందా.. ఆమె కార్యక్రమానికి జనాలు వస్తారా.. ఎందుకు ఈ కార్యక్రమం అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారికి కవిత స్పష్టంగా అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే కవిత చేపట్టే కార్యక్రమం సక్సెస్, ఫెయిల్ అన్న అంశాలతో ముడిపడి లేదు. అసలు తెలంగాణ సమాజానికి ఏం కావాలన్నది తెలుసుకునేందుకే ఆమె ఈ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏ పార్టీ లీడర్ కానీ ఉద్యమ నేతలు కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ప్రజలు ఏమీ అనుకుంటున్నారో మనం హైదరాబాద్ లోని ఏసీ రూముల్లో కూర్చొని డిసైడ్ చేయవద్దని ఆమె ఎప్పుడు చెబుతుంటారు. వారి వద్దకు వెళ్లి వారితో కూలంకషంగా మాట్లాడినప్పుడు మాత్రమే వారిని అర్థం చేసుకోవచ్చంటారు.
అందుకే కవిత ‘జనం బాట’ పట్టనున్నారు. ఒకరిద్దరితో ఒకటి రెండు రోజులు మాట్లాడితే తెలంగాణ ఏం కోరుకుంటుందో తెలియదు. అన్ని వర్గాలను కలవాలి. వారి సమస్యలేంటి.. వాటికి సొలుష్యన్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే స్పష్టత వస్తుంది. ఈ కారణంగా కవిత రైతులు, మహిళలు, కార్మికులు, యువత, మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాలు ఇలా ప్రతి ఒక్కరినీ తన ‘జనంబాట’ లో భాగస్వాములను చేయనున్నారు. ఒక్కటి, రెండు ప్రాంతాలని కాకుండా మొత్తం తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల సాధక బాధకలు తెలుసుకోనున్నారు. అన్ని వర్గాల వారితో మాట్లాడిన తర్వాతనే తెలంగాణ ఆకాంక్షలేంటన్నది ఒక క్లారిటీ వస్తుందని ఆమె భావిస్తున్నారు. అంటే మొత్తం తెలంగాణనే సమగ్ర అధ్యయనం చేయనున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచే తెలంగాణ ప్రజల గొంతుగా ఉన్నారు కవిత. ఈ ప్రాంతం, సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఉద్యమం సమయంలోనే తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించారు. దాదాపు 19 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా ఆమె ఆ సంస్థ నడుపుతున్నారు. తెలంగాణ జాగృతి అనే సంస్థ ఓ రాజకీయ పార్టీకి ఏమాత్రం తీసిపోదు. లక్షల మంది కార్యకర్తలు ఆ సంస్థ సొంతం. ఓ ప్రతిపక్ష పార్టీ మాదిరిగా వందలాది ప్రజా సమస్యల మీద కవిత ఆధ్వర్యంలో ఈ సంస్థ పోరాటాలు చేసింది. ముఖ్యంగా మరుగున పడిన మన సంస్కృతిని వెలుగులోకి తెచ్చేందుకు ఆమె చేసిన కృషి అంతా ఇంతా కాదు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితదే. సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఏ వర్గానికి అన్యాయం జరగవద్దని కవిత ఉద్యమం నాటి నుంచే భావించే వారు. తెలంగాణ సాధించుకుంటే అన్ని వర్గాలకు మేలు జరగాలని అప్పటి నుంచే ఆమె భావించారు. అమర వీరుల కుటుంబాలకు న్యాయం జరగటం, తెలంగాణ యువతకు ఉద్యోగాలు, ఇక్కడి చరిత్ర, ప్రముఖులకు గౌరవం, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని బలంగా ఆకాంక్షించేవారు.
తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు వెళ్తుందని కవిత భావించారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కొంతవరకు కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసినప్పటికీ తెలంగాణ ఏమీ కోరుకుంటుందో ఆ దిశగా బీఆర్ఎస్ పనిచేయలేకపోయింది. ఉద్యమ నేపథ్యం, అమర వీరుల త్యాగాల నుంచి పుట్టిన పార్టీ ఆయా వర్గాలకు తగినంతగా న్యాయం చేయలేకపోయిందనే విమర్శలను ఎదుర్కొంటున్నది.
కాంగ్రెస్, బీజేపీ గురించి చెప్పటానికి ఏమీ లేదు. ఆ రెండు పార్టీలకు ఈ ప్రాంతం మీద ప్రేమ, మమకారం లేవు. ఫక్తు రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. మనది అనుకున్న బీఆర్ఎస్ కూడా తెలంగాణ ప్రజలు కోరుకున్న దారిలో ముందుకు సాగలేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ మళ్లీ ఒంటరి అయ్యింది. ఇప్పుడు తెలంగాణ గోస వినే పార్టీ లేకుండా పోయింది. అసలు సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న దానిపై ఇప్పుడున్న ఒక్క పార్టీ కూడా దృష్టి పెట్టటం లేదు. గతంలో తెలంగాణ ప్రాంతం మీద ఏ విధంగా వివక్ష కొనసాగిందో… ఇప్పుడు అదే విధంగా కొన్ని వర్గాల పై వివక్ష కొనసాగుతోంది. అలాంటి వివక్ష లేకుండా సామాజిక తెలంగాణ కావాలని కవిత భావిస్తున్నారు. అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశాలు అందివచ్చినప్పుడే ఆయా వర్గాలు బాగుపడతాయని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. 20 ఏళ్లుగా తెలంగాణ సమాజంతో కలిసి నడిచిన కవితకు ఈ ప్రాంతం సాధక బాధకాలు తెలుసు. తెలంగాణ ప్రజల గొంతుక అనేది లేకపోతే గతంలో ఎలా నష్టపోయమన్నది కూడా తెలుసు. అందుకే తెలంగాణ గొంతుక కావాలని ఆమె భావిస్తున్నారు. తన నాలుగు నెలల ‘జనం బాట’ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నదే తెలుసుకోవాలని భావిస్తున్నారు.
వాటి పరిష్కారానికి తన అనుభవంతో పాటు మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఉద్యమ కారుల కుటుంబాలు, ఉద్యమ కారులు ఏం కోరుకుంటున్నారో కూడా తెలుసుకోనున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలన్నది కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆమె సిద్ధం చేయనున్నారు. మొత్తం నాలుగు నెలల పాటు తెలంగాణను సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత దానికి అనుగుణంగా కవిత కార్యాచరణ తీసుకోనున్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయపార్టీ పెట్టేందుకు తాను సిద్ధమేనని కవిత ఇది వరకే ప్రకటించారు. ఈక్రమంలోనే ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు, ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.



