Friday, December 19, 2025
E-PAPER
Homeమానవికవిత్వమే నా ఏకైక మార్గం

కవిత్వమే నా ఏకైక మార్గం

- Advertisement -

నయాబ్‌ మిధా… స్పోకెన్‌ వర్డ్‌ ఆర్టిస్ట్‌. హిందీ కవయిత్రి అయిన ఈమె కవిత్వం అద్భుతంగా రాస్తారు. నిర్భయ ఘటన తర్వాత మొదటి సారి తన గొంతు విప్పిన ఆమె ఇప్పుడు తన రచనల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఓ కళాకారిణిగా సోషల్‌ మీడియాలో లక్షల మందికి అభిమానిగా మారిపోయారు. తన కవిత్వంతో ప్రజలను కదిలిస్తున్నారు. కళలతో ఆలోచింపజేస్తున్నారు. ‘తుమ్‌ ఖూబ్‌ సూరత్‌ హౌ’, ‘ముస్కురావో’, ‘నాన్‌ కి కహానీ’, ‘ఆదత్‌’ వంటి అద్భుతమైన కవిత్వాన్ని రచించారు. ముఖ్యంగా మహిళల జీవితాల చుట్టూ అల్లుకున్న ప్రేమ, జీవితంలో సవాళ్లపై రచనలు చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

గత నెల ఆక్లాండ్‌లోని ఒక మాల్‌లో షాపింగ్‌ చేస్తున్న మిధాను ముందు రోజు రాత్రి ఆమె ప్రదర్శనకు హాజరైన 60 ఏండ్ల వ్యక్తి కలిసి ‘నిన్న నువ్వు నా జీవితాన్ని మార్చేశావు. నేను 40 ఏండ్లు వెనక్కి వెళ్లినట్లు నాకు అనిపిస్తుంది. ఈ రోజు నాలో కొత్త శక్తి పుంజుకుంది’ అని చెప్పాడు. భారతదేశంతో పాటు విదేశాలలో 200 కంటే ఎక్కువ ప్రదర్శనలను ప్రదర్శించిన స్పోకెన్‌ వర్డ్‌ ఆర్టిస్ట్‌కు ఇది అసాధారణ సంఘటన కాదు. మిధా కవిత్వం, కథలు రాస్తుంది. అయితే అందులో మనందరి జీవితాలు కనిపిస్తాయి. ప్రతి వ్యక్తిని ప్రభావితం చేస్తాయి.

హృదయాన్ని తాకే పదాలు
‘ముస్కురావ్‌’ అనే కవిత వైరల్‌ అయిన తర్వాత 2023లో మిధాకు మంచి గుర్తింపు వచ్చింది. అందులోని పదాలు అత్యంత సరళంగా ఉన్నప్పటికీ హృదయాన్ని తాకుతాయి. ”ముస్కురావ్‌.. అగర్‌ తుమ్‌ కిసే సే హార్‌ గయే హో/ కిసికో ఉస్‌ జీత్‌ తుమ్సే జ్యాదా జరురత్‌ థి షాయద్‌… (ఎవరితోనైనా ఓడిపోతే మీరు నవ్వండి. బహుశా ఈ విజయం మీ కంటే వారికి ఎక్కువగా అవసరం కావచ్చు).. ముస్కురావ్‌.. అగర్‌ కుచ్‌ ఖో గయా హో / జిస్కా నసీబ్‌ కా థా, ఉస్కో మిల్‌ గయా హై షాయద్‌… (మీ నుంచి ఏదైనా జారిపోతే నవ్వండి… ఎందుకంటే అది వారికి దక్కాలని వుంది.. అందుకే చివరకు వారినే చేరి ఉండవచ్చు)..ఇవే ముస్కురావ్‌ కవితలోని కొన్ని లైను.

అస్తవ్యస్తమైన బాల్యం
పాకిస్తాన్‌ సరిహద్దులోని రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌ అనే పట్టణంలో జన్మించిన మిధా బాల్యం అస్తవ్యస్తంగా గడిచింది. ఆమె తల్లిదండ్రులలో ఒకరు తమ సరదాల కోసం బతుకుతుంటే మరొకరు కుటుంబం పట్ల బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఈ వాతావరణమే ఆమె కవిత్వం రాయడానికి ఒక మలుపుగా మారింది. తన తొమ్మిదేండ్ల వయసులోనే కవిత్వం రాయడం మొదలుపెట్టింది. ‘నేను చాలా చిన్నతనంలోనే నన్ను నేను గుర్తించుకోవడం ప్రారంభించాను. నా తల్లిదండ్రులు ఇద్దరూ అద్భుతమైన వ్యక్తులు, కానీ చాలా భావోద్వేగ సమస్యలు ఉన్నాయి. వారి సంబంధంలో ఉన్న ఇబ్బందులను అంగీకరించే ధైర్యం వారికి లేదు’ అని మిధా పంచుకుంది.

గొంతు విప్పిన క్షణం
నిర్భయ కేసు సమయంలో ఆమె మొదటిసారి గొంతు విప్పింది. ‘నా రక్తం చాలా మరుగుతోంది, నేను నా సొంత ఊరిలో, లౌడ్‌ స్పీకర్‌ రిక్షాలో తిరుగుతూ కవిత్వం చెప్పడం ప్రారంభించాను. ఎందుకంటే నేను అనుకున్నది చెప్పడానికి నాకున్న ఏకైక మార్గం కవిత్వమే’ అని మిధా అంటున్నారు. అప్పటి నుండి ఆమె మహిళల గురించి రాయడం ప్రారంభించింది. అలాగే ప్రేమ, స్నేహంతో పాటు తన తల్లిదండ్రుల గురించి ఆలోచనలుగా రూపాంతరం చెందింది. ఇంటిని ఎంత తొందరగా వదిలి వెళితే అంత మంచిదని భావించిన మిధా 16 ఏండ్ల వయసులో శ్రీ గంగానగర్‌ నుండి ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడానికి కోటాకు వెళ్లింది. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఆమె 2018లో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించింది. ‘ఐటీ రంగంలో శిక్షణ పొందిన కార్మికురాలు’ అయ్యింది. ‘కానీ నేను మంచి కార్మికురాలిని కాలేకపోయాను. అందుకే ఈవెంట్స్‌ స్పేస్‌లో చేరడానికి నాకు ఆఫర్‌ వచ్చినప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. కానీ కోవిడ్‌ వల్ల ఆ ఉద్యోగాన్ని కూడా కోల్పోయాను’ అంటుంది. అయితే కవిత్వం పట్ల ప్రేమ మాత్రం కొనసాగింది. కళాశాలలో ఉన్నప్పుడు అన్ని పోటీలలో రాణించిన ఏకైక ఇంజనీరింగ్‌ అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది.

ముస్కురావ్‌ పుట్టిన క్షణం
మే 8, 2023… ఈ తేదీకి ముందు మిధా తాను ఉంటున్న ఇంటి అద్దె చెల్లించడానికి ఇబ్బంది పడుతోంది. ఆ తర్వాత తరచూ విమానాశ్రయాలలో ఆమె కనిపించేది. ‘ముస్కురావ్‌’ (చిరునవ్వు) కవిత వైరల్‌ అయింది. బిబిసి ఆమెను ‘ముస్కురావ్‌ అమ్మాయి’ అని పిలిచింది. అంటే అది ఆమె ఇంటి పేరుగా మారింది. ‘ఒక్క రాత్రిలో నా ప్రపంచం మారిన క్షణం అది’ అని ఆమె అన్నది. ముస్కురావ్‌ కంటే ముందు మిధా చిన్న ప్రదర్శనలు చేసింది. అప్పుడు 30 నుండి 50 సీట్లు మాత్రమే నిండేవి. ముస్కురావ్‌ తర్వాత టిక్కెట్లు 100 నుండి 200 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. 250 టిక్కెట్లు అమ్ముడైనప్పుడు ఆమె బృందం అహ్మదాబాద్‌లో ఒక ఆడిటోరియం బుక్‌ చేసుకుంది.

యువరాణి జననం
అప్పటివరకు చిన్న చిన్న షోలు చేస్తున్న మిధా తన భావాలను మరింతగా పంచుకోవాలనుకుంది. వారం రోజుల్లో ఆమె చెప్పాలనుకున్న అన్ని విషయాలపై ఒక షో రాసింది. అందులో ఆధునిక స్త్రీత్వం, వివాహం, వాయిదా పడిన కలలు, అద్భుత కథల అంచనాలు, జీవించిన వాస్తవాల మధ్య అంతరం ఉన్నాయి. ఇవన్నీ కలిపి మూడు గంటల అన్వేషణ ‘రాజకుమారి’గా ఉద్భవించింది. ‘రాజకుమారి అడుగుతుంది: యువరాణి ఏ యువరాజు తన కోసం రాలేదని గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది? ఆమె తనను తాను రక్షించుకోవాలని గుర్తించినప్పుడు ఏం జరుగుతుంది?’ అందులో చెబుతుంది. అయితే తనను తాను రక్షించుకోవాలని ఆమెకు ఎవరూ చెప్పరు. కానీ ఒక రోజు ఒక యువరాజు వస్తాడని, ప్రపంచం ఒక అద్భుత కథగా మారుతుందని మాత్రం చెబుతుంది. అందుకే తన తల్లి చేసినట్టే ఆమే వివాహం చేసుకుంటుంది. కానీ మీరు అలా చేయకూడదనుకుంటున్నారు. ఎందుకంటే మీ కలలు అసంపూర్ణంగా ఉన్నాయి’.. ఇలా అమ్మాయిల్లో చైతన్యం నింపేందుకు తన షోల ద్వారా మిధా ప్రయత్నిస్తుంది.

ప్రపంచమంతా ప్రదర్శించాలి
ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షలకు పైగా వీక్షకులను అధిగమించిన మొదటి మహిళా స్పోకెన్‌-వర్డ్‌ ఆర్టిస్ట్‌గా మిధా చరిత్ర సృష్టించింది. ఆమె సోషల్‌ మీడియా పరిధి ఇప్పుడు 2.4 మిలియన్లకు చేరుకుంది. అయితే ఈ సోషల్‌ మీడియాతో ప్రయాణం అంత సులభం కాదు. అనేక దాడులను కూడా ఎదుర్కొంటుంది. పెండ్లి విషయంలో అమ్మాయిల స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు ఆమె గురించి మగవారు తీవ్రమైన కామెంట్లు చేశారు. అయితే ఆమె గతంలో వలె అనవసరమైన విషయాలకు స్పందించడం మానుకుంది. అంతకు మించి ఒక కవయిత్రిగా, నటిగా మిధాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ‘నిజానికి జీవితాలను మార్చిన వ్యక్తిగా నేను పేరు పొందాలనుకుంటున్నాను. అది కళ చేయాల్సిన పనిగా నేను అనుకుంటున్నాను. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఇంగ్లీష్‌ సెట్‌ కూడా ఉండాలి. కవిత్వం ప్రతిచోటా ఉండేలా చూసుకోవాలి’ అంటూ మిధా తన మాటలు ముగించింది.

ఉమెన్‌ జకీర్‌ ఖాన్‌
సీనియర్‌ నటుడు, కథకుడు రోషన్‌ అబ్బాస్‌ ఆమెను ‘ఉమెన్‌ జకీర్‌ ఖాన్‌’ అని పిలుస్తారు. ఖాన్‌ హిందీ కథల వలెనే సందర్భోచితంగా, హృదయపూర్వకంగా మిధా కవిత్వం రాస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అబ్బాస్‌ ఆమెను ‘ఉమెన్‌ జకీర్‌ ఖాన్‌’ అని ఎందుకు అన్నారంటే జాకీర్‌ భారు స్త్రీ పురుష దృక్పథంతో ఉంటాడు. అమ్మాయిలు పురుషుల నుండి ఏం కోరుకుంటున్నారో ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. నేను వేదికపై మాట్లాడుతున్నది జీవితంలో చాలామంది స్త్రీల దృక్పథం, మనం ఏమి అనుభవిస్తున్నామో అదే నేను వేదికలపై మాట్లాడుతున్నాను. నాకు, నా ప్రియుడికి, నా తల్లిదండ్రులకు మధ్య ఉన్న సంబంధాన్ని కథ ద్వారా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని ఆమె వివరిస్తుంది.

సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -