మంత్రముగ్ధులైన సాహిత్యాభిమానులు
రెండు సెషన్లలో 30 మంది కవుల కవితా గానం
నవతెలంగాణ-ముషీరాబాద్
అక్షరాల నిధి.. పుస్తకాల కాణాచి అయిన 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురువారం సాయంత్రం కవితా గానంతో ఉర్రూతలూగింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలోని అనిశెట్టి రజిత వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనం సాహిత్యాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. బుక్‌ఫెయిర్ అధ్యక్షులు, ప్రముఖ కవి యాకుబ్, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి, బుక్‌ఫెయిర్ కార్యదర్శి, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ వాసు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, పేర్ల రాములు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. రెండు సెషన్లుగా సాగిన ఈ సమ్మేళనంలో 30 మంది కవులు పాల్గొని సమకాలీన అంశాలపై తమ గలాన్ని వినిపించారు. సమ్మేళనంలో ఒక్కో కవిత ఒక్కో అనుభూతిని పంచింది. ‘మా నాన్న ప్రవహించే దుఖ:నది’ శీర్షికతో సాగిన కవిత అందరినీ ఆలోచింపజేయగా..’దక్షిణ భారతదేశానికి బర్రె ఆవుతో సమానం’ అంటూ ద్రవిడ దేశంలో బర్రె ప్రాముఖ్యతను చాటిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేబుల్ టీవీ సంస్కృతిపై ‘బలిపీఠం’ పేరుతో ఓ వృద్ధుడు వినిపించిన కవిత.. టీవీ సీరియళ్లకు మహిళలు ఎలా బానిసలవుతున్నారో వ్యంగ్యంగా చెప్పడంతో సభికుల్లో నవ్వులు పూశాయి. ‘కాలం పరిగెడుతోంది.. సంక్షోభంలో నేను’, ‘నీడ ఇంకా వేలాడుతోంది’, ‘తొవ్వ నేర్పిన కవిత’, ‘గాజులు తొడుక్కున్నావా’ వంటి కవితలు మనిషి అంతరంగ మథనాన్ని ఆవిష్కరించి శ్రోతల హృదయాలను తాకాయి. అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొన్న వారిని కవులు మునాస వెంకట్, ఆనందచారి సన్మానించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలచారి విచ్చేసి కవులకు అకాడమీ తరపున నూతన సంవత్సర క్యాలెండర్లను అందజేశారు. కవి సమ్మేళనంలో హనీఫ్, స్వాతి శ్రీపాద, హిమజ, మేడిపల్లి రాజ్‌కుమార్, ఇబ్రహీం నిర్గన్, నిర్మలా రాణి తోట, ఎన్.లహరి, వీఆర్ తూములూరి, రఘువీర్ ప్రతాప్, లావణ్య శైలేశ్వర్, తుమ్మల దేవరావు, గిరిధర్, సుంకర రమేష్జీ దేవేంద్ర, మోహనకృష్ణ, నక్క శ్రీనివాస్, సూకర కృష్ణ ప్రసాద్, గిన్నారపు ఆదినారాయణ, టీఆర్‌ఎల్ స్వామి, మేరెడ్డి రేఖ, అప్పు వెంకట నారాయణ తదితరులు పాల్గొని తమ కవితలను వినిపించారు.



