– కళలను ప్రోత్సహించాలి : రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్
– 10 రోజులు జానపద కళల జనజాతర : ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.అబ్బాస్
– ‘తెలంగాణ సమగ్ర సాంస్కృతిక విధానం’పై రౌండ్‌టేబుల్ సమావేశం
నవతెలంగాణ – ముషీరాబాద్
తెలంగాణ పోరాట గడ్డపై విష సంస్కృతి విలయతాండవం చేస్తోందని, దాన్నుంచి ప్రజలను రక్షించేందుకు.. వారిని చైతన్యవంతం చేసేందుకు కళలను ప్రోత్సహించాలని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ”తెలంగాణ సమగ్ర సాంస్కతిక విధానం”పై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల నుంచి పెద్దల వరకు విష సంస్కృతికి బానిసలవుతున్నారని, దీనికి కాషాయం, కార్పొరేట్ శక్తులు కారణమవుతున్నాయని తెలిపారు. పురోగమన భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కళాకారుల ద్వారా అవగాహన పెంచాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే జానపద అకాడమీ, బాలల సాహిత్య అకాడమీ, లలితకళల అకాడమీ, సంగీత నృత్య అకాడమీ, ఫొటోగ్రఫీ అండ్ చిత్రకళల అకాడమీలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రత్యేక అధికారిని నియమించి నిధులు, విధులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలను కళాయాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గణతంత్ర, లౌకిక వ్యవస్థ, సమానత్వం వంటి అంశాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు విలువ, సమాజం పట్ల బాధ్యత వంటి అంశాలపై కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించి.. వాటిని ప్రోత్సహించాలని కోరారు.
విజ్ఞానదర్శిని రమేష్, పీఎన్ మూర్తి, సాంబరాజు, యాదగిరి, అరుణోదయ రాకేష్ రజినీ, రాధిక, శ్రీలక్ష్మీ నృత్య గురువులు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నాయకులు బుచ్చిరెడ్డి, సాంబిరెడ్డి, కవి మహేష్ దుర్గే, వనపర్తి జిల్లా అయెధ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు.
10 రోజులు జానపద కళల జనజాతర
ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ.. 11 ఏండ్లుగా తెలంగాణ కళాకారులకు సరైన గుర్తింపు, వృద్ధాప్య భృతి, ఉచిత ప్రయాణం, డబుల్ బెడ్ రూం ఇల్లు వంటి మౌలిక సౌకర్యాలు అందడం లేదన్నారు. ఆగస్టు 22న జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్లె నుంచి పట్నం వరకు 10 రోజులు జానపద కళల జనజాతర నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో గ్రంథాలయాలను పునరుద్ధరించి నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలని, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయాలని, షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించాలని అన్నారు. ఊరూరా మినీ థియేటర్లు ఏర్పాటు చేయాలని, పిల్లల సినిమాలను ప్రదర్శించాలని కోరారు. పుష్ప, రజాకార్ లాంటి సినిమాలను ప్రోత్సహించడమంటే విష సంస్కృతిని, స్మగ్లర్లను ప్రోత్సహించడమే అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి జి.రాములు అధ్యక్షత వహించగా.. టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు సమగ్ర సాంస్కృతిక విధానానికి నోట్ ప్రతిపాదించారు. తెలంగాణ సమగ్ర సాంస్కృతిక విధానంపై తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ప్రతిపాదనలను జులై 18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేయాలని, వీటిని వెంటనే అమలు చేయాలని, జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయిం చుకున్నారు.