చిన్నారులు తాగే నీటిలో విషం కలిపిన మతోన్మాదుల దుశ్చర్య మానవత్వానికే మాయని మచ్చ. ముస్లిం ప్రధానోపాధ్యాయుడిని లక్ష్యంగా చేసుకుని కర్నాటకలోని హుళికట్టి గ్రామ ప్రాథమిక పాఠశాల తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపేందుకు ప్రణాళిక రూపొం దించి, అమలు చేసిన శ్రీరామ్ సేన దుర్మార్గం మతోన్మాద దుశ్చర్యలకు సజీవ సాక్ష్యం. ఆ నీటిని ఆ ఉపాధ్యాయుడు తాగకపోవచ్చునని, అవి తాగిన అభంశుభం తెలీని చిన్నారులు బలవుతారన్న కనీస స్పృహ కూడా లేకుండా ఈ దురాగతానికి పాల్పడటంలోనే వారి ఆలోచనలు ఎంత విషపూరితమయ్యాయో స్పష్టమవుతోంది.
విభిన్న మతాలు, కులాలు, సాంప్రదా యాలు, అలవాట్లు, ఆలోచనల సమాహారంగా ఉన్న విశాల భూభాగమే మన దేశం. విభజించు.. పాలించు.. సిద్ధాంతం పేరుతో హిందూ, ముస్లిం సంస్థలను ప్రోత్సహించి, దేశ విభజనకు కారకులయ్యారు బ్రిటీష్‌వారు. మతాల మధ్య సామరస్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీని బలిగొన్నది ఈ మతోన్మాదమే. ఆ భావజాలం నుంచి పురుడు పోసుకున్న సంస్థలు నిత్యం పెంచిపోషించేది మతాల మధ్య చిచ్చు. వాటి ఆధారంగా అందలాలెక్కడమే! ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్‌లలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రమోద్ ముతాలిక్ 2005లో స్థాపించినదే శ్రీరామ్ సేన. న్యాయం, ధర్మం ఆధారంగా పరిపాలన ఉండాలనేది శ్రీరాముడి ఆశయమని వాల్మీకి రామాయణం చెబుతుందని, మతాల వారీగా, కులాల వారీగా విభజించేది కాదని మహాత్మా గాంధీ అనేకసార్లు తన యంగ్ ఇండియా పత్రికలో రాశారు. అందుకు భిన్నంగా ఆర్‌ఎస్‌ఎస్ బాటలో పరమత ద్వేషాన్ని ప్రబోధించడం కోసమే శ్రీరామ్‌సేన కర్నాటకలో పనిచేస్తోంది. మోరల్ పోలీసింగ్ పేరుతో వాలంటైన్స్ డే రోజు మాట్లాడుకుంటున్న యువతీ యువకులకు బలవంతంగా పెళ్లిళ్లు చేయడం, తన సభ్యులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇవ్వడం, పలు దాడులు, ముస్లిం యువకుడి హత్య సహా పలు కేసుల్లో ఈ సంస్థ సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఈ భావజాలం బుర్రనిండా నింపుకున్న ఆ సంస్థ తాలూకా అధ్యక్షుడు సాగర్ పాటిల్ ప్రభుత్వ పాఠశాలకు ముస్లిం ప్రధానోపాధ్యాయుడుగా ఉండకుండా చేయాలని పథకం రూపొందించాడు. మరో ఇద్దరితో కలిసి అక్కడ చదువుతున్న బాలుడిని ప్రలోభపెట్టి పురుగు మందు కలిపిన బాటిల్ ఇచ్చి, ట్యాంకులో కలిపేలా ఒత్తిడి చేశాడనేది పోలీసుల కథనం. ఆ ఉపాధ్యాయుడి ప్రాణాలకు ప్రమాదం తలపెట్టడం, ఆ పేరుతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించడమో ప్రధానంగా భావించాడు తప్ప.. పసిపిల్లల ప్రాణాలను పణం గా పెడుతున్నామన్న స్పృహ కూడా కరువైంది. పరివార్ కుదురులోంచి వచ్చిన సంస్థల్లో, ఆ భావజాలంతో నడుస్తున్న మతోన్మాద సంస్థల్లో సర్వసాధారణంగా వ్యక్తమయ్యే లక్షణమే ఇది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రఖ్యాత చిలుకూరు బాలజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్‌పై జరిగిన దాడి కూడా ఇలాం టిదే. ‘రామరాజ్యం’ అనే పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని, తనతో చేతులు కలపడానికి నిరాకరించాడని వృద్ధుడని కూడా చూడకుండా అర్చకునిపై దాడికి పాల్పడ్డాడు. ‘హిందూత్వ’ను ప్రభుత్వ అధికార సిద్ధాంతంగా చేస్తూ లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాన్ని ‘హిందూ రాష్ట్ర’గా మార్చివేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను చాపకింద నీరులా అమలు చేస్తున్త్న ఇలాంటి సంస్థల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. దేశమంతటా ఒకేఒక హిందూత్వ అస్తిత్వాన్ని సీష్టించడం కోసం ముస్లింలు, క్రైస్తవులు తదితర మైనారిటీలను పరాయివారుగా పరిగణించి, దాడులు చేస్తూ..అక్కడి బీజేపీ ప్రభుత్వాల సాయంతో వారి ఇళ్లను కూల్చివేస్తూ..అమాయకులను శిక్షిస్తున్న ఉదంతాలెన్నో చూస్తున్నాం. సరైన సాక్ష్యాధారాలు సమర్పించకుండా ‘మాలేగావ్’ పేలుళ్ల వెనకున్న నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేయించుకున్న ఇటీవల ఉదంతమూ ఎరుకే. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు, రాజ్యాంగానికి, ప్రభుత్వానికి ప్రమాదకరంగా ఉన్నాయని సర్దార్ వల్లభారు పటేల్ నాటి సంఫ్‌ు నేత శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖలు నేటికీ భద్రంగా ఉన్నాయి. నరేంద్రమోడీ పాలనలో ఏటా పెరుగుతున్న మత ఘర్షణలు ఈ ప్రమాదానికి హెచ్చరికలే.
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్
‘విష’బీజాలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES