Saturday, June 14, 2025
E-PAPER
Homeక్రైమ్కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు

కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు

- Advertisement -

– నిందితుల అరెస్ట్‌
– తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ శివరాంరెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ

నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం సాయంత్రం కిడ్నాపైన రెండేండ్ల బాలుడిని పోలీసులు రక్షించారు. నిందితులను అరెస్టు చేసి.. బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించారు. బుధవారం నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బైరం అంజిబాబు, భాగ్యలక్ష్మి దంపతులకు కుమారుడు సోమేశ్వర కుమార్‌(20నెలలు) ఉన్నాడు. ప్రస్తుతం భాగ్యలక్ష్మి 8 నెలల గర్భవతి కావడం, ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె భర్త, కుమారుడు, వారి ఇంటి పక్కన ఉండే కుంచం పార్వతమ్మతో కలిసి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయింది. ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రసూతి విభాగం ముందు చెట్టు కింద భాగ్యలక్ష్మి, వారితో వచ్చిన పార్వతమ్మ కూర్చున్నారు. అక్కడే వున్న ఇద్దరు గుర్తు తెలియని మహిళలు వారితో మాటలు కలిపి బాలున్ని ఆడిస్తున్నట్టు నటించారు. ఆ తర్వాత ‘మీరిద్దరూ భోజనం చేసి రండి.. మేం బాలున్ని చూసుకుంటామని’ నమ్మించారు. దీంతో భాగ్యలక్ష్మి, పార్వతమ్మ భోజనానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఇద్దరు మహిళలు బాలున్ని తీసుకుని పారిపోయారు. ఈ విషయంపై బాలుని తల్లిదండ్రులు, వారితో వచ్చిన పార్వతమ్మ కలిసి వెంటనే నల్లగొండ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి నాలుగు టీములుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్పత్రి ఆవరణలో సీసీ కెమెరాలను పరిశీలించి.. నిందితుల కోసం పరిసరాలు, బస్టాండ్‌లో వెతికారు. గుండాల మండలం పెద్ద పడిశాల గ్రామంలోని నిందితురాలి తల్లిగారింటి వద్ద పట్టుకున్నారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్‌కు చెందిన నారాయణదాసు అరుణ, జంతిక సుక్కమ్మ, పాలడుగు సుగుణమ్మపై కేసులు నమోదు చేశారు.
డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో బాలుడి కిడ్నాప్‌ కేసును 7గంటల్లోనే ఛేదించిన టూటౌన్‌ సీఐ రాఘవరావు, నార్కెట్‌పల్లి సీఐ నాగరాజు, నల్లగొండ టూటౌన్‌ ఎస్‌ఐ వై.సైదులు, ఎస్‌ఐ యూ.సతీష్‌, భువనగిరి పట్టణ సీిఐ శ్రీ రమేశ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ రాజు, కానిస్టేబుల్స్‌ సాగర్ల శంకర్‌, లావూరి బాలకోటి, జానకిరామ్‌, తిరుమలేష్‌ను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -