Wednesday, December 10, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మికవర్గంలో రాజకీయ చైతన్యాన్ని కల్పించాలి

కార్మికవర్గంలో రాజకీయ చైతన్యాన్ని కల్పించాలి

- Advertisement -

– ఫిబ్రవరిలో ప్రత్యక్ష ఆందోళనలు
– విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరు : సీఐటీయూ రాష్ట్ర మహాసభలో జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు
మెదక్‌ నుంచి ఎస్‌.వెంకన్న

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుల, మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజల దృష్టిని మరల్చుతున్న ప్రస్తుత తరుణంలో కార్మికవర్గం మరింత అప్రమత్తంగా ఉండాలని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎమ్‌. సాయిబాబు సూచించారు. వారిని రాజకీయంగా చైతన్యపరచాల్సిన బాధ్యత సీఐటీయూపై ఉందని ఆయన నొక్కి చెప్పారు. మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరిలో ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టబోతున్నామని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కూలీలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

మెదక్‌ పట్టణంలో మూడు రోజులపాటు కొనసాగిన సీఐటీయూ ఐదో రాష్ట్ర మహాసభ మంగళవారం స్ఫూర్తిదాయకంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రతినిధులనుద్దేశించి సాయి బాబు ప్రసంగిస్తూ… కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను బలహీనపర్చి పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని దుయ్యబట్టారు. అందులో భాగంగానే నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేసేందుకు దూకుడుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలను ప్రతిఘటించేందుకు క్షేత్ర స్థాయిలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో మోడీ నేతృత్వంలోని ‘కార్పొరేట్‌ మతోన్మాద ప్రభుత్వం’ రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామిక విలువలను ఉల్లంఘిస్తూ ‘శ్రమశక్తి నీతి -2025’ పేరుతో కొత్త కార్మిక విధానాన్ని తీసుకు రాబోతున్నదని హెచ్చరించారు. దీనికి మనువాదం ప్రేరణని చెప్పటం అత్యంత దారుణమని అన్నారు.

రాజ్యాంగం కల్పించిన సమానత్వ సూత్రాలకు తిలోదకాలిస్తూ రాజధర్మం, మనుధర్మం పేరుతో కుల, మత విభజనలతో కార్మిక వర్గ పోరాటాలను బలహీన పర్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాలను ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ల వల్ల కార్మికులకు వేతనాల గ్యారంటీ, సామాజిక భద్రత, మహిళా కార్మికులకు సాధికారత, వ్యక్తిపరమైన ఆరోగ్య భద్రతకు ఎలాంటి గ్యారెంటీ ఉండబోదని హెచ్చరించారు. యూనియన్లు పెట్టుకునే హక్కు, సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె చేసే హక్కులపై తీవ్ర దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్‌ కోడ్‌లను తమ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ కేరళ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. అదే తరహాలో తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మికులను సమరశీల పోరాటాల వైపునకు నడిపించేందుకు వీలుగా ఈనెల 31 నుంచి జనవరి నాలుగు వరకు విశాఖపట్నంలో నిర్వహించబోయే సీఐటీయూ అఖిల భారత మహాసభల్లో కార్యాచరణ రూపొందించబోతున్నట్టు సాయిబాబు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -