ట్రంప్ కాంపాక్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు
పాల్గొన్న వందకి పైగా విశ్వవిద్యాలయాలు
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ‘కాంపాక్ట్’కు వ్యతిరేకంగా ఆ దేశంలోని పలు యూనివర్సిటీల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా వందకు పైగా యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నిరసనలు చేపట్టారు. వీరంతా కాంపాక్ట్‌కు వ్యతిరేకంగా ఒకే స్వరాన్ని వినిపించారు. ట్రంప్ ప్రభుత్వం ఉన్నత విద్యలో రాజకీయ జోక్యం చేస్తున్నదని విమర్శించారు. గతనెల 1న ట్రంప్ ప్రభుత్వం ‘కాంపాక్ట్ ఫర్ అకాడమిక్ ఎక్స్‌లెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ను ప్రతిపాదించింది. ఇప్పుడిదే అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఆందోళనకు కేంద్ర బిందువుగా మారింది.
ఏమిటి ఈ ‘కాంపాక్ట్’?
ఇది పది పాయింట్ల ఒప్పందం. దీనిని మొదట ఎంఐటీ, బ్రౌన్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ వంటి తొమ్మిది ప్రముఖ విశ్వవిద్యాలయాలకు పంపారు. ఈ ఒప్పందం ప్రకారం.. సంతకం చేసిన కాలేజీలకు అమెరికా ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు, అదనపు సహాయాన్ని అందిస్తుంది. ఇందుకుగానూ సదరు కాలేజీలు కొన్ని విధాన మార్పులు అంగీకరించాలి. అయితే ఈ మార్పుల పైనే విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిధుల కోసం స్వతంత్రతను కోల్పోయే ప్రమాదమున్నదని అక్కడి విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది యూనివర్సిటీ స్వతంత్రత, విద్యా స్వేచ్ఛను హరిస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా తొమ్మిది యూనివర్సిటీల్లో ఏడు ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఒప్పందాన్ని బహిరంగంగానే తిరస్కరించడం గమనార్హం. ఈ నిరసనల్లో విద్యార్థులు, అధ్యాపకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పలు యూనివర్సిటీల్లో ఆందోళనలు నిర్వహించారు. ట్రంప్ విధానానికి వ్యతిరేకంగా వారంతా నిరసన గళం వినిపించారు. ‘స్టాండ్ ఫర్ స్టూడెంట్స్-రిజెక్ట్ ట్రంప్ కాంపాక్ట్’ అనే బ్యానర్లతో విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యా, యూనివర్సిటీ స్వతంత్రతతో పాటు చౌకైన విద్య, ట్రాన్స్‌జెండర్ విద్యార్థుల హక్కులు, వలసదారుల రక్షణ, న్యాయమైన వేతనాలు వంటి డిమాండ్లు వినిపించారు. ‘ఈ కాంపాక్ట్‌ను ప్రస్తుత రూపంలో సంతకం చేయం’ అని నార్త్ కరోలినా యూనివర్సిటీ చాన్స్‌లర్ చేసిన ప్రకటనతో ఈ ఉద్యమానికి ఊపొచ్చింది. వచ్చే మే డే నుంచి మరింత పెద్ద స్థాయిలో సమ్మెలకు పిలుపునివ్వాలని ‘స్టూడెంట్స్ రైజ్ అప్’ విద్యార్థి సంఘం యోచిస్తున్నది.



