ఇమ్మిగ్రేషన్ పాలసీపై డెమోక్రాట్లు వర్సెస్ రిపబ్లికన్లు
ఎన్నికల్లో ప్రయోజనం కోసం పాకులాట
ట్రంప్ విధానాలపై ప్రజల నుంచి విమర్శలు
వాషింగ్టన్ : అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) నిధులపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య జరిగిన రాజకీయ పోరు తీవ్రంగా కొనసాగుతోంది. ఇరు పక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వినియోగించుకునేందుకు చూస్తున్నాయి. అయితే ఇందులో ఎవరి ప్రయత్నాలను వారు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు చెప్తున్నారు.
అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ అధికారులపై చట్టపరమైన నియంత్రణలు విధించాలని ప్రయత్నించారు. అయితే రిపబ్లికన్ల నుంచి సహజంగానే మద్దతు లేకపోవడంతో ఈ ఫలితాలు విజయవంతం కాలేదు. అయినప్పటికీ.. నవంబర్ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని రెండు పార్టీలూ ఆశిస్తున్నాయని పరిశీలకులు చెప్తున్నారు.
ప్రభుత్వం షట్‌డౌన్‌ను ముగించేందుకు సెనెట్ ఆమోదించిన రాజీ బిల్లును హౌజ్ రిపబ్లికన్లు తిరస్కరించారు. తర్వాత వారు తమ స్వంత ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే దానిని సెనెట్ డెమోక్రాట్లు అంగీకరించబోమని స్పష్టం చేశారు. డెమోక్రాట్లు ఐస్ అధికారుల కఠిన చర్యలను వ్యతిరేకిస్తూ, వారికి అదనపు నిధులు ఇవ్వకుండా నిలిచారు. అలాగే అధికారులు తమను గుర్తించాల్సిన అవసరం, మాస్కులు ధరించకూడదని, చర్చిలు, ఆస్పత్రులు, పాఠశాలల వద్ద చర్యలు ఆపాలనీ, వ్యక్తిగత ఇండ్లలోకి ప్రవేశించడానికి కోర్టు అనుమతి తీసుకోవాలని వారు కోరారు. కానీ ఈ ప్రతిపాదనలను రిపబ్లికన్లు తిరస్కరించారు. కాగా రిపబ్లికన్లు ట్రంప్ ఇచ్చిన హామీ ప్రకారం అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించడం అవసరమని వాదిస్తున్నారు.
అలాగే వారు ఓటింగ్ సంస్కరణల బిల్లు (సేవ్ అమెరికా యాక్ట్) ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించి, విఫలమ య్యారు. ఇరుపక్షాలు తమ వైపు విజయంగా చూపించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ… ఆ ప్రయోజనం పెద్దగా ఏ పక్షానికీ కలగలేదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో రిపబ్లికన్లు ఇమ్మిగ్రేషన్ అంశాన్ని బలంగా వినియోగించుకునే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఇక ప్రజాభిప్రాయం ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ విషయంలో ట్రంప్ ప్రభుత్వ విధానాలను చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ రాజకీయ పోరాటం వల్ల విమానాశ్ర యాల్లో సమస్యలు కూడా పెరిగాయి. తగిన వేతనాలు లేకపోవడంతో ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ ఏజెన్సీ (టీఎస్ఏ)లో సుమారు 500 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. దీనితో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అదనంగా విమానాశ్రయాల్లో ఐస్ అధికారుల ఉనికి ప్రయాణికుల్లో భయం, ఆందోళనకు కారణమవుతోంది.



