గ్రామ ఓటర్లనే నియమించుకోవాలి
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంటే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డుకు పోటీ చేస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్ ను నియమించుకోవాలి. సదరు ఓటర్లను గుర్తించేది ఏజెంట్స్ కావడంతో సర్పంచ్ పోటీ చేసే ప్రతీ అభ్యరి వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి ఏజంట్ ను నియమించుకుంటేనే విజయం సాధ్యమవుతుంది. సర్పంచ్ పదవికి పోటీ చేసే వ్యక్తులు ఏ వార్డు నుంచైనా వార్డు మెంబర్ అయితే ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారో అదే వార్డుకు సంబంధించిన ఓట రును పోలింగ్ ఏజెంట్ గా నియమించుకోవాలనే నిబంధన ఉంది. ఏదైనా కారణాల వల్ల ఇతరులను నియమించుకోవాల్సి వస్తే ముందే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా తెలిజేయాలి. దానిని పరిశీలించి అనుమతి ఇస్తే తప్ప ఇతరులను నియమించుకునేందుకు వీలులేదు.
ఓటర్లను గుర్తించేది ఏజెంట్లే..
ప్రతివార్డులో ఆ వార్డుకు సంబంధించిన ఓటరు వచ్చినప్పుడు ఎన్నికల సిబ్బంది ముందుగా క్రమ సంఖ్యతో పాటు అతని పేరు, అంగీకరించినప్పుడే ఓటరుకు వేలుపై ఇంక్ పెట్టి బ్యాలెట్ పేపర్ అందజేస్తారు. ఓటరుకు బ్యాలెట్ పేపర్ అందిన తర్వాత ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎన్నికల అధికారి దానిని పరిగణలోకి తీసుకోరు.ఎవరైనా ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రిసీడింగ్ అధికారి సమక్షంలో నిగ్గు తేల్చిన తర్వాతే ఆ ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి స్కూట్నీ పూర్తి కాగానే ఏజెంట్ ను నియ మించుకునే వ్యక్తి అంగీకార పత్రాన్ని రాత పూర్వకంగా డూప్లికేట్ కాపీతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపించాలి. పరిశీలన అనంతరం రిటర్నింగ్ అధికారి నియామక పత్రంపై ఆమోదం తెలుపుతూ సంతకం చేసి ఒక కాపీని ఏజెంట్ కు అందజేస్తారు.



