సహచర మంత్రి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు
బహిరంగ క్షమాపణకు దళిత సంఘాలు డిమాండ్
‘అడ్లూరి’ని నేనేం అనలేదు.. ఇదంతా బీఆర్‌ఎస్ కుట్రేనన్న ప్రభాకర్
ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా: అడ్లూరి
పార్టీలో ప్రకంపనలు.. సర్దుబాటుకు అధిష్టానం యత్నం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
సహచర మంత్రిపై నోరు జారిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టారు. సమావేశానికి సమయానికి రాలేదన్న అసహనంతో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి ‘ఆ దున్నపోతుగానికేం తెలుసు’ అంటూ బాడీ షేమింగ్‌పై చేసిన వ్యాఖ్యల వీడియో పుటేజీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యాఖ్యలు మైక్‌లో రికార్డయి బయటకు రావడంతో వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. ఇది కేవలం ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలకు దారితీసినా.. ‘మాదిగల ఆత్మగౌరవం’ చుట్టూ తిరుగుతూ కులం రంగు పులుముకుంది. మంత్రి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, దళిత సంఘాలు క్షమాపణకు అల్టిమేటం జారీ చేయడంతో ఈ ఎపిసోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సంక్షోభానికి దారితీసింది. పొరపాటును అంగీకరించకుండా ‘ఇది బీఆర్‌ఎస్ కుట్ర’ అంటూ పొన్నం చెప్పడాన్ని మంత్రి అడ్లూరి, ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది పొన్నం అహంకార వైఖరికి నిదర్శనమనే అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది.
అసలేం జరిగింది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహ్మత్ నగర్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే, మంత్రి లక్ష్మణ్ కాస్త ఆలస్యంగా రావడంతో పొన్నం ప్రభాకర్ అసహనానికి గురయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు.. ఆ.. దున్నపోతు గానికి’ అని గుసగుసలాడారు. మైకులు ఆన్‌లో ఉండటంతో ఈ వ్యాఖ్యలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. సహచర మంత్రిని, అందులోనూ ఒక దళిత మంత్రిని ఉద్దేశించి బాడీ షేమింగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది కేవలం లక్ష్మణ్‌కు జరిగిన అవమానం కాదని, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఎమ్మార్పీఎస్ వంటి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
క్షమాపణకు ససేమిరా.. బీఆర్‌ఎస్ కుట్రంటూ ఎదురుదాడి
వివాదం ముదురుతున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ తీరులో మార్పు రాలేదు. తప్పును అంగీకరించి క్షమాపణ కోరాల్సింది పోయి, ఎదురుదాడికి దిగారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇదంతా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ‘అడ్లూరి వ్యాఖ్యలపై నేను స్పందించను. పీసీసీ అధ్యక్షులు నాతో మాట్లాడారు.. అదే ఫైనల్’ అని చెప్పడం ద్వారా ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని చూశారు. అయితే, ఆయన వైఖరి.. సమస్యను మరింత జఠిలం చేసింది. కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడం పొన్నం అహంకారానికి నిదర్శనమని, ఆయనలోని దురుసుతనాన్ని ఇది బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే సమయంలో ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించకపోతే, అది ప్రభుత్వ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించడంతో పాటు పార్టీలోని సామాజిక తరగతుల మధ్య అగాధాన్ని పెంచే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తా : అడ్లూరి
పొన్నం వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ‘జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుంది. మాదిగలు అంటే అంత చిన్న చూపా?’ అని ఆయన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం తన తప్పు తెలుసుకుంటాడని ఆశించానని, కానీ ఆయన మారకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా, ‘నేను మాదిగను కాబట్టే నాకు మంత్రి పదవి వచ్చింది. నేను మంత్రి కావడం, మా సామాజిక తరగతిలో పుట్టడం తప్పా?’ అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మంత్రి వివేక్ తన పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడటం లేదని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన వాపోయారు.
సర్దుబాటుకు అధిష్టానం యత్నం
ఈ వివాదం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలను మరోసారి బయటపెట్టింది. సొంత పార్టీ నేతలే పొన్నం వైఖరిని తప్పుబడుతున్నారు. జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు సైతం లక్ష్మణ్‌కు మద్దతుగా నిలిచి, పొన్నం తీరును తప్పుబట్టాయి. బుగ్గారం మండల కాంగ్రెస్ నాయకులు పొన్నం వ్యాఖ్యలను ఖండించారు. మరో మంత్రి శ్రీధర్‌బాబు కూడా పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దాంతో రంగంలోకి దిగిన టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ ఇద్దరు మంత్రులతో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిచే ప్రయత్నం చేశారు. మరోవైపు 24 గంటల్లో పొన్నం క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మార్పీఎస్ హెచ్చరించింది. పొన్నంను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. మొత్తం మీద, పొన్నం ప్రభాకర్ నోటి దురుసు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ వివాదాన్ని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.