నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్థిక, భాషాపరమైన ఇబ్బందులు పేదలు కోర్టులు, చట్టాలపై అవగాహన పొందేందుకు అడ్డంకులుగా ఉన్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన లీగల్ అండ్ జస్టీస్ ఎడ్యుకేషన్ @ 2047 ఎడ్యుకేషన్: యాన్ అజెండా ఫర్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ‘పై మొదటి ప్రొఫెసర్ ఎన్.ఆర్. మాధవ మీనన్ స్మారక ఉపన్యాసంలో సిజెఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రసంగించారు. అణగారిన మరియు బలహీన వర్గాల ప్రజలకు కోర్టులు, చట్టాలపై అవగాహన పొందడంలో భౌగోళిక, ఆర్థిక మరియు భాషాపరమైన ఇబ్బందులు భయంకరమైన అడ్డంకులుగా మారాయని అన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో, సమీప కోర్టు లేదా లీగల్ డిపార్ట్‌మెంట్ వారికి భౌతికంగా అందుబాటులో లేవని, గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి న్యాయం పొందడంలో అంతరాలు ఎదురవుతున్నాయని అన్నారు.
భాషాపరమైన బహిష్కరణ కూడా పరాయీకరణను శాశ్వతం చేసింది. చట్టాలపై అవగాహన మరియు ప్రకియలు ప్రజలల్లోని చాలా వర్గాలకు తెలియని భాషల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చట్టం నిజంగా సాధికారతకు ఒక సాధనంగా ఉండాలంటే, ఈ అడ్డంకులను తొలగించడం చాలా అవసరం అని బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు. ప్రాతీయ భాషల్లో బోధనను ప్రోత్సహించడానికి, న్యాయ సహాయానిన బలోపేతం చేయడానికి మరియు మొదటితరం అభ్యాసకులకు మార్గాలను సృష్టించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి న్యాయ విద్యను పున:రూపకల్పన చేసి విస్తరించాల్సి వుందని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ (డాక్టర్) ఎస్. శివకుమార్ సంపాదకీయం వహించిన ”సస్టైనబిలిటీ అండ్ సబ్సిస్టెన్స్: లీగల్ స్ట్రాటజీస్ ఫర్ ఎ గ్రీన్ ప్లానెట్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లాస్ ఇన్ ఏసియా: ఎ రెట్రోస్పెక్ట్ ” అనే మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ శివకుమార్, ప్రొఫెసర్ (డాక్టర్) లిసా పి.లుకోస్ సంపాదకత్వం వహించిన ‘లా అండ్ సొసైటీ : డ్యూరింగ్ అండ్ పోస్ట్ కోవిడ్ పాండమిక్’ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.