– అగ్రిగేటర్ నిబంధనలు పాటించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోర్టర్ ఆన్‌లైన్ బిజినెస్ యాప్‌లో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ నేతలు రవాణా శాఖ మంత్రిని కోరారు. ఈ మేరకు ఆ సంఘం హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో సుమారు 30 వేల మందికి పైగా డ్రైవర్ కమ్ ఓనర్స్ పోర్టర్ యాప్‌లో భాగస్వాములుగా పనిచేస్తున్నారని తెలిపారు. అయితే, అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ చట్టం ప్రకారం డ్రైవర్లకు దక్కాల్సిన ప్రయోజనాలు కల్పించడంలో పోర్టర్ యాజమాన్యం విఫలమైందని అన్నారు. నిబంధనల ప్రకారం సంస్థ ద్వారా ప్రతి డ్రైవర్‌కూ రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉండగా యాజమాన్యం దీనిని పాటించడం లేదని తెలిపారు. డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం అంతర్గతంగా ఒక యంత్రాంగం ఏర్పాటు చేయాలని చట్టం చెబుతున్నా.. పోర్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యం వహించిందని అన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.అజరు బాబు మాట్లాడుతూ.. చిన్న చిన్న కారణాలకే డ్రైవర్లను సస్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం సస్పెన్షన్‌కు ముందు నోటీసు ఇచ్చి వివరణ కోరాల్సి ఉన్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టర్ యాజమాన్యం గైడ్‌లైన్స్ ప్రకారం నడుచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించడంతోపాటు త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో పోర్టర్ యూనియన్ నాయకులు బి.మహేష్, ఆర్కే రవి, ఎస్‌డీ. మునీర్, వెంకటేష్ నాయక్, విష్ణు, ఎండీ మోయిన్, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఉమేష్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ కలీం, ఉపాధ్యక్షులు ముఖేష్ శర్మ, హైదరాబాద్ సబర్బన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ షేక్ సాబీర్, నాయకులు ముస్తాక్ సిద్ధిక్, జగన్ తదితరులు ఉన్నారు.
పోర్టర్ యాప్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



