Saturday, June 14, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపేదరికం తగ్గుదల.. ప్రచారం మాత్రమేనా!?

పేదరికం తగ్గుదల.. ప్రచారం మాత్రమేనా!?

- Advertisement -

భారతదేశంలో గత పదకొండేళ్లలో తీవ్ర పేదరికం 27.1 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గిందంటూ ప్రపంచ బ్యాంక్‌ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. అత్యంత పేదరికం నుంచి 26.9 కోట్ల మంది బయటకు వచ్చారని పేర్కొంది. 2011-12లో 34.4 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉండగా, 2022-23 నాటికి ఈ సంఖ్య 7.5 కోట్లు మాత్రమేనని పేర్కొంది. ఇదే విషయాన్ని మీడియా, సోషల్‌ మీడియాలో బీజేపీ ప్రచారం జోరందుకుంది. ప్రధాని మోడీ సైతం తన ప్రసంగాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెబుతున్నారు. అయితే అసలు పేదరికం నిర్వచనంపైనే అనేక విమర్శలున్నాయి. పేదరికం తగ్గితే మరి 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌, ఉపాధి హామీ వంటి పనులు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి.
రోజుకు రూ.200 లోపే..
ప్రపంచ బ్యాంక్‌ డేటాలో అత్యంత పేదరికానికి రోజుకు రూ.2.15 డాలర్లు (2022-23 ధరల ప్రకారం) అంటే రూ.200 లోపు వ్యయం చేసే వారిని పరిగణనలోకి తీసుకున్నది. అంటే నెలకు సుమారు రూ.5200 వ్యయం చేసే శక్తి ఉండడం. ఈ కేటగిరిలో 2011-12లో 16.2 శాతం మంది ఉండగా, ఇది 2.3 శాతానికి తగ్గిందట. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 18.4 నుండి 2.8 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 10.7 నుంచి 1.1 శాతానికి తగ్గిందట. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం రూరల్‌-అర్బన్‌ పేదరిక వ్యత్యాసం 7.7 నుంచి 1.7 శాతానికి తగ్గింది. లోయర్‌-మిడిల్‌-ఇన్‌కమ్‌ పేదరికం.. అంటే రోజు వ్యయం 3.65 డాలర్లు (సుమారు రూ.300) కంటే తక్కువ నుంచి 37 కోట్ల మందికి పైగా బయటపడ్డారని పేర్కొంది. అంటే నెలకు రూ.8,800 ఖర్చు చేసే శక్తి ఉన్నవారు. అయితే ఇక్కడ పేదరికం నిర్వచనమే తప్పుగా తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రోజురోజుకూ అన్ని రకాల ధరలూ పెరుగుతుండగా.. పేదరికాన్ని లెక్క వేయడానికి తీసుకునే ప్రామాణికాలే తప్పుగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రకారమే తీసుకున్నా.. 2011-12లో 60.18 శాతం మంది ప్రజలు రోజుకు 3.65 డాలర్లు (రూ.300 వరకు) సంపాదనతో జీవించేవారు. 2022-23 నాటికి ఈ సంఖ్య 28.1 శాతానికి తగ్గింది. అంటే ఆ నివేదిక ప్రకారమే చూసుకున్నా ఇప్పటికీ 35 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరికంలో ఉన్నట్టే. పేదరికం తగ్గిందని ఓ వైపు ప్రగల్భాలు పలుకుతూనే.. మరోవైపు 80 కోట్ల మందికి (దేశ జనాభాలో 55 శాతం) ఉచిత రేషన్‌ పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. ఒక వేళ పేదరికం తగ్గితే ఇంత మందికి ఉచిత రేషన్‌ పంపిణీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 30 శాతం కుటుంబాలు ఉపాధి హామీ పథకం పనులపై ఆధారపడి జీవిస్తున్నాయి.
గత, ప్రస్తుత శాంపిలింగ్‌లో వ్యత్యాసం..
2011-12లో చేసిన సర్వేలతో పోల్చుకుంటే 2022-23 చేసిన హౌస్‌ హౌల్డ్‌ కన్స్యూమర్‌ ఎక్స్‌పెండిచర్‌ సర్వేలో శాంపిలింగ్‌ డిజైన్‌, డేటా సేకరణ, రీకాల్‌ పీరియడ్‌లలో తీవ్ర వ్యత్యాసమున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరోవైపు 2017-18 సర్వే డేటాను ప్రభుత్వం ‘డేటా క్వాలిటీ’ కారణాలతో విడుదల చేయలేదు. ఇది డేటా పారదర్శకతపై అనేక అనుమానాలకు తావిస్తున్నది. పేదరికాన్ని ఆదాయం ఆధారంగా కాకుండా వినియోగ వ్యయం ఆధారంగా లెక్కించడం ద్వారా ఇది రోజువారీ కూలీలు, స్వయం ఉపాధి వారి ఆర్థిక అస్థిరతను దాచిపెడుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వినియోగ ఆధారిత జినీ కోఎఫిషియంట్‌ (వినియోగ వ్యయంలో ఆర్థిక అసమానతలు) 2011-12లో 28.8 శాతం ఉండగా, ఇది 2022-23కి వచ్చే సరికి 25.5కి తగ్గిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అదే సమయంలో ఆదాయ ఆధారిత జినీ కోఎఫిషియంట్‌ (ఆదాయ అసమానతలు) 2004లో 52 శాతం ఉండగా, 2023లో ఇది 62 శాతానికి పెరిగింది. అంటే ఆదాయ, వ్యయాల్లో పూర్తి వ్యతిరేక దశ్యం మనకు కనిపిస్తుంది. మరోవైపు 40 శాతానికి పైగా సంపదను దేశంలోని ఒక శాతం జనాభా మాత్రమే కలిగి ఉండగా, 6.4 శాతం సంపదను దిగువన ఉన్న 50 శాతం మంది జనాభా కలిగి ఉన్నారు.
ఎన్నికల కోసమే ‘పేదరికం తగ్గుదల’!
రానున్న ఏడాది కాలంలో జరిగే ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు పేదరికం తగ్గుదల అనే అంశాన్ని ఒక ప్రచార అస్త్రంలా బీజేపీ వాడుకుంటున్నది. ముఖ్యంగా బీహార్‌లో వచ్చే నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ పేదరికం అనేది ప్రధాన సమస్య. పేదరికం తగ్గించామనే అంశం ద్వారా ఇక్కడ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు 2026 మే నుంచి ఆగస్టు మధ్యలో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడా ఈ అంశాన్ని లేవనెత్తి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఫిరోజ్‌ ఖాన్‌
9640466464

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -