Sunday, December 21, 2025
E-PAPER
Homeజాతీయంఅధికారం ఏ ఒక్క దేశానికీ పరిమితం కాదు

అధికారం ఏ ఒక్క దేశానికీ పరిమితం కాదు

- Advertisement -

శక్తిమంతమైన దేశం తన ఇష్టాలను ఇతరులపై రుద్దొద్దు : కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌

పూణే : భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం శక్తిమంతమైన దేశమైనంత మాత్రాన అది తన ఇష్టాలను ఇతరులపై రుద్దడం సరికాదని స్పష్టం చేశారు. ప్రపంచీకరణ మన ఆలోచన, పని విధానాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. శనివారం మహారాష్ట్రలోని పూణేలో గల సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌లో జరిగిన స్నాతకోత్సవంలో కేంద్రమంత్రి మాట్లాడారు. ప్రపంచవాప్తంగా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అనేక అధికార కేంద్రాలు ఉద్భవించాయని మంత్రి జైశంకర్‌ చెప్పారు. అధికారం అనేదానికి ఎన్నో అర్థాలు ఉంటాయనీ, వాణిజ్యం, మిలటరీ, ఇంధనం, సాంకేతికత, ప్రతిభ ఆధారంగా అవి మారుతుంటాయని వివరించారు. ఈ అధికారం ఏ ఒక్క దేశానికీ పరిమితం కాదని, ఈ విషయాన్ని గ్లోబల్‌ పవర్స్‌ గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎంత శక్తిమంతమైన దేశమైనా సరే అది తన ఇష్టాలను ఇతరులపై రుద్దలేదని, ప్రపంచ దేశాల మధ్య సహజమైన పోటీ ఉందని కేంద్రంమంత్రి చెప్పారు. ఇక భారత్‌ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు తయారీ రంగంలో దూసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తుచేశారు. కాగా ప్రస్తుతం భారత్‌ – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. భారత్‌పై అమెరికా సుంకాలు, ప్రస్తుత వాణిజ్య చర్చలు నడుస్తున్న తరుణంలో జైశంకర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా పైనే ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్‌ భారత్‌ వస్తువులపై టారిఫ్‌ను రెట్టింపు చేసి 50 శాతానికి చేర్చారని జైశకంర్‌ చెప్పారు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ దిగుమతులపై భారత్‌ పన్నులు తగ్గించాలని యూఎస్‌ కోరుతోందని, అందుకు భారత్‌ ఒప్పుకోవడం లేదని తెలిపారు. ఆ నేపథ్యంలోనే ట్రంప్‌ టారిఫ్‌లను ఆయుధంగా వాడుకుంటున్నారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -