Friday, December 19, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపంచాయతీలకు 'పవర్‌' పరేషాన్‌

పంచాయతీలకు ‘పవర్‌’ పరేషాన్‌

- Advertisement -

‘భారతదేశ ఆత్మ దాని గ్రామాల్లోనే నివసిస్తుంది’ అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. ఏ వ్యవస్థకైనా ఆర్థిక మూలాలు బలంగా ఉంటేనే అది బలంగా ఉంటుంది. క్షీణిస్తే ఆ వ్యవస్థ మనుగడకే ప్రమాదం. రాష్ట్రంలో మూడు దశల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు ఈ నెల పదిహేడుతో పూర్తయ్యాయి. ఇక పాలకవర్గాల ప్రమాణస్వీకారం వారంలోపే జరిగే అవకాశముంది. గత సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి నిధుల కోసం అష్టకష్టాలు పడ్డారు. చాలామంది ప్రతిష్ట కోసం, మరికొంత మంది గ్రామస్తుల ఒత్తిడి మేరకు పంచాయతీలో నిధులు లేకున్నా పనులు చేసింది మాత్రం వాస్తవం. దీనికోసం చాలామంది సర్పంచులు అప్పుల పాలవడం, వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి ఘటనలు బాధాకరం. అప్పులు తీర్చలేక ఇంకొంతమంది హైదరాబాద్‌లాంటి పట్టణాలకు వలసెళ్లి వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్న పరిస్థితి దాపురించింది. రావాల్సిన బిల్లులు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్నాయంటే మాటలు కాదు. అయితే ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులకు అరకొర నిధులు, పెండింగ్‌ బిల్లులు స్వాగతం పలుకుతున్నాయి.

గ్రామ పాలనకు ఆధారం స్థానిక సంస్థలు. గ్రామపంచాయతీ వ్యవస్థ భారత దేశ ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు. 1992వ సంవత్సరం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 243 వలన గ్రామపంచాయతీ వ్యవస్థ ఏర్పడింది. గ్రామం ఒక యూనిట్‌ గా నవ ప్రజాస్వామ్యానికి అడుగులు పడ్డాయి. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన కీలకమైన మౌలిక 23 అంశాలు రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో ఉంచబడ్డాయి. రాష్ట్రంలో 12,760 గ్రామపంచాయతీలు, 567 మండల ప్రజా పరిషత్తులు, 31 జిల్లా ప్రజా పరిషత్తులు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థలకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులే కీలకం. అయితే కేంద్రం నుంచి రావాల్సిన రూ.3500 కోట్ల నిధులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీని వలన పంచాయతీలకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే విద్యుత్‌ నియంత్రణ మండలి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు గ్రామ స్వరాజ్యానికి గొడ్డలి పెట్టులా మారాయి. విడ్యుత్‌ మండలి విధించిన 2025-26 సంవత్సర ధరల ప్రణాళిక ప్రజాస్వామ్యవాదులను, స్థానిక సంస్థలను, రాష్ట్ర ప్రజలను విస్మయించపరిచే విధంగా ఉన్నాయి.

స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్ట్రీట్‌ లైట్‌ (వీధిదీపాల)కు వినియోగించే విద్యుత్‌ చార్జీలు యూనిట్‌కు ఏడు రూపాయల పది పైసలు, గ్రామీణ తాగునీటి అవసరాల కోసం వినియోగించే పంపుల విద్యుత్‌కి యూనిట్‌కు ఆరు రూపాయలు చొప్పున గ్రామపంచాయతీ నిధుల నుండి వసూలు చేస్తున్నాయి. ఇవి ప్రజల కనీస సౌకర్యాలు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే విద్యుత్‌ ధరలను వీటికి విధించడం అన్యాయం. దీనివలన చాలా గ్రామపంచాయతీ వ్యవ స్థలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. ప్రతి పంచాయతీ సగటున నెలకి రూ.25వేలు, పెద్ద పంచాయతీలైతే 50 వేలు, అలాగే ప్రతి మున్సిపాలిటీ నెలకు లక్షల్లో విద్యుత్‌ చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంత పెద్దమొత్తం విద్యుత్‌ బిల్లులే కడితే ఇక గ్రామ పరిపాలన ఏ విధంగా సాధ్యం?
స్థానిక సంస్థలకు వచ్చే నిధులలో సింహభాగం కేవలం విద్యుత్‌ కొనుగోలుకే గ్రామ పంచాయతీలు చెల్లిస్తున్నాయి. దీనివలన నిధుల కొరత ఏర్పడి గ్రామపాలన అస్తవ్యస్తంగా మారిపోతుంది.

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి, వ్యవసాయ పంపులకు ఉచిత విద్యుత్తు పథకాలను అందిస్తున్నా మని గొప్పలు చెబుతున్నా, మరోవైపు దేశానికి పట్టుకొమ్మలైన గ్రామపంచాయతీల ప్రజల మౌలిక, అత్యవసర సేవలపై అధిక విద్యుత్‌ ధరలను విధిస్తూ స్థానిక సంస్థల ఆర్థిక వ్యవస్థను నడ్డివిరచడం బాధాకరం. విద్యుత్‌ బిల్లులు స్థానిక సంస్థల స్వయం అభివృద్ధికి కనీస అవసరాలకు షరాఘతంలా మారాయి. మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా అంటే సర్కార్‌ ఆ దిశగా ఆలోచించడం లేదు.ప్రతి జీపీ వాటి జనాభా విద్యుత్‌ వినియోగాల ఆధారంగా యాభై నుండి వంద కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పరిచితే, రాష్ట్రవ్యాప్తంగా 700 నుండి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది. పర్యావరణ పరిరక్షణ, రాష్ట్ర విద్యుత్‌ భద్రత ఏర్పడటమే కాక స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. కేవలం మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో భవిష్యత్‌ తరాలకు వెలుగు నింపే అవకాశముంది. ఈ దిశగా అడుగులు వేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది.

ఆకుల సంపత్‌ కుమార్‌
9959477044

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -