మౌలిక వసతుల కల్పన పేరిట షరతులు
వడ్డీల్లేని రుణాలు ఇస్తామంటూ ఆశ చూపుతున్న మోడీ సర్కార్
50 ఏండ్లు వెసులుబాటు కల్పిస్తామని హామీ
రోడ్లు, రైల్వేలు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఎకో టూరిజం, సాంకేతిక కేంద్రాలు, రోప్‌వేలకు నిధులు
ఇతర రాష్ట్రాలతోపాటు తెలంగాణాకూ ప్రతిపాదనలు
బి.వి.యన్.పద్మరాజు
సర్వ రోగ నివారిణి జిందాతిలిస్మాత్..
ఇప్పుడిదే సూత్రాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్, అన్ని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. అదే పీపీపీ (పబ్లిక్ ప్రయివేట్ పార్ట్‌నర్‌షిప్)… మీకు అభివృద్ధి పనులు కావాలంటే మేం చెప్పిన విధంగా పీపీపీ పద్ధతికి ఓకే చెప్పాలంటూ హుకూం జారీ చేసింది. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తన ఆర్థిక అవసరాల రీత్యా తెలంగాణ ప్రభుత్వం సైతం వాటికి ‘తలూపక తప్పని సరి’ పరిస్థితి నెలకొంది. మన రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో.. రాష్ట్ర ఉన్నతాధికారులు ఇప్పటికే ఒక దఫా సమాలోచనలు జరిపినట్టు సమాచారం. వీటిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై వారు మేధోమధనం చేస్తున్నారు.
ప్రపంచ బ్యాంకు మార్గనిర్దేశంలో నిటి అయోగ్ సిఫారసుల మేరకు వివిధ రాష్ట్రాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలంటూ కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్, ఒరిస్సాల్లో వైద్యరంగంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను మోడీ సర్కార్ ఈ సందర్భంగా ఉదహరించింది. ఆస్పత్రుల్లో సీజీహెచ్‌ఎస్ అమలు, పడకల సంఖ్య పెంపు, వైద్య కళాశాలల్లో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు తదితరాంశాలకు సంబంధించి చేపట్టిన సంస్కరణలను వివరించింది. ఆ రాష్ట్రాల తరహాలోనే మిగతా రాష్ట్రాల్లోనూ తమ మార్గదర్శకాలను అమలు చేస్తే ప్రభుత్వాలు బాండ్ల రూపంలో తెచ్చుకునే రుణాల్లో 50 శాతాన్ని వీటికి వాడుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. బ్యాంకుల నుంచి తెచ్చుకునే అప్పులపై మరింత వెసులుబాటును కల్పిస్తామంటూ హామీనిచ్చింది. ఇలాంటి మరెన్నో సంస్కరణలన్నింటినీ కలిపి ‘వికసిత్ భారత్ ఏ2047’ అని పేరు పెట్టింది. మొత్తం 476 వ్యూహాత్మక అంశాలతో దీన్ని రూపొందించారు.
పంద్రాగస్టు సందర్భంగా గోల్కొండ కోట వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్-2047′ లక్ష్యాలు కూడా కేంద్రం ఆదేశాలకు (వికసిత్ భారత్ ఏ2047’) అనుగుణంగా ఉన్నట్టు కనబడుతున్నాయి. ‘ఫైనాన్సింగ్ పాత్‌వేస్ ఫర్ విజన్ 2047-రోల్ ఆఫ్ పబ్లిక్ ప్రయివేటు పార్ట్‌నర్‌షిప్’ అనే అంశం ఆ లక్ష్యాల జాబితాలో ఉండటం గమనార్హం. అందుకనుగుణంగా రాష్ట్రంలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రాజెక్టులను చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నారని సమాచారం.
రాష్ట్రాలకు కేంద్రం గాలం వేసిందిలా…
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలను మున్సిపాల్టీ స్థాయిలో, ఇంకా చెప్పాలంటే కేంద్రం ముందు చేతులు చాచి అడుక్కునే స్థితికి మోడీ సర్కార్ దిగజార్చింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ‘జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ-వివిధ రాష్ట్రాల సంప్రదింపుల సమావేశం’లో డిప్యూటీ సీఎం భట్టి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జీఎస్టీ కాకుండా గతంలోని వ్యాట్‌ను కొనసాగించి ఉంటే 2024-25లో తెలంగాణకు కేంద్రం నుంచి రూ.69,373 కోట్ల ఆదాయం వచ్చేదనీ, కానీ జీఎస్టీ వల్ల అది రూ.42,443 కోట్లకు పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేట్ల హేతుబద్ధీకరణ వల్ల ఏటా రూ.7 వేల కోట్లను తెలంగాణ నష్టపోనుందని ఆయన తెలిపారు. అంతిమంగా ఇది సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితీ ఇదే. ఈ బలహీనతను ఆసరాగా చేసుకున్న కేంద్రం… ‘వికసిత్ భారత్-2047’ గైడ్‌లైన్స్‌ను అమలు చేస్తే…ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ ఫండ్ (ఐఐపీడీఎఫ్) కింద ఒక్కో రాష్ట్రం 50 ఏండ్లలో రూ.1.5 లక్షల కోట్ల రుణాలను తీసుకునే వెసులుబాటును కల్పిస్తామంటూ పేర్కొంది. అది కూడా ఎలాంటి వడ్డీ లేకుండా తీసుకోవచ్చునని ఆశ చూపింది. భవిష్యత్తులో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టుల కోసం రూ.10 లక్షల కోట్ల నిధిని సమకూరుస్తామంటూ తన విధాన పత్రంలో తెలిపింది. ఈ నేపథ్యంలో అసలే ఆర్థిక సమస్యలు, అప్పులతో సతమతమవుతున్న తెలంగాణ సర్కారు… తన ‘ఆర్థిక నిర్వహణ’ కోసం కేంద్రం షరతులకు తలొగ్గినట్టు సమాచారం.
రాష్ట్రంలో చేపట్టబోయే ప్రధాన ప్రాజెక్టులు…
-నీటి పారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ ఉత్పత్తుల స్టోరేజీ సెంటర్లు, రోడ్లు, రైల్వేలు, స్టేట్ ఎయిర్‌పోర్టులు, పర్యావరణ అనుకూల పర్యాటకం, ఆస్పత్రులు, ప్రభుత్వ విద్యా సంస్థలు, తీగల వంతెన(రోప్‌వేలు)లు, రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తూ రోడ్లు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, శాస్త్ర, సాంకేతిక కేంద్రాలు, విద్యార్థుల హాస్టళ్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు(ఎమ్‌ఎమ్‌ఎల్‌పీలు)లు, బయోగ్యాస్ ప్రాజెక్టులు, ట్రాన్స్‌మిషన్ లైన్లు, డేటా సెంటర్లు, టెలికామ్ సేవలు, క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు, ట్రైనింగ్ అకాడమీలు, టెక్స్‌టైల్ పార్కులు… వీటిని పీపీపీ పద్ధతుల్లో అభివృద్ధి చేయాలంటూ కేంద్రం సూచించింది.
తలొగ్గితే ఇక అంతే…
ప్రస్తుతం రాష్ట్రంలో పైసల కటకట కొనసాగుతోంది. వచ్చే ఆదాయానికి, పోయే రూపాయికి, పొంతన లేకపోవటంతో ఖజానా విలవిల్లాడుతోంది. దీంతో సాధారణ ఖర్చులు, చెల్లింపులు, జీత భత్యాలకే గగనమైపోతోందని ఆర్థిక శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అవసరాల రీత్యా కేంద్రం షరతులకు తలొగ్గి, రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేస్తే అది తెలంగాణకు మరింత ప్రమాదమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెస్‌లు, యూజర్ ఛార్జీల రూపంలో ఇప్పటికే జనంపై ఇబ్బడిముబ్బడిగా భారాలు పడుతున్న దరిమిలా…మున్ముందు పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రజా వ్యతిరేకత రాకుండా పాలకులు జాగ్రత్త పడుతున్నారు. గతంలోలాగా ఒకేసారి భారాలేయకుండా కొద్దికొద్దిగా అమలు చేస్తున్నారు. ఏదేమైనా… వికసిత్ భారత్ లక్ష్యాలను తెలంగాణలో అమలు చేయజూస్తే… అది అంతిమంగా ‘రాష్ట్రంపై వేలాడే మరో కత్తే…’కానుందని వారు హెచ్చరిస్తున్నారు.