మొదటి రోజు సాయంత్రం వరకు విచారణ
ఏడు రోజులు ఏసీపీ కార్యాలయంలోనే
నవతెలంగాణ- హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు శుక్రవారం జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావును శుక్రవారం నుంచి ఏడు రోజులపాటు సిట్ అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి ప్రభాకర్‌రావు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి సిట్ చీఫ్ వెంకటగిరి నేతృత్వంలో ప్రభాకర్‌రావు విచారణను ప్రారంభించారు. మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇచ్చిన అధికారులు తిరిగి విచారణ చేపట్టారు.
ఇందులో గతంలో సిట్ అరెస్టు చేసిన నలుగురు పోలీసు అధికారులు ప్రవీణ్‌రావు, భుజంగరావు, తిరుపతయ్య, రాధాకిషన్‌రావులు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని ప్రభాకర్‌రావుపై సిట్ అధికారులు ప్రశ్నలను సంధించారని సమాచారం. ప్రధానంగా 2023 ఉప ఎన్నికలు మొదలుకుని 2024లో జరిగిన సాధారణ ఎన్నికల వరకు ప్రతిపక్షాలకు చెందిన నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయిం చడంలో మీ పాత్ర ఉందనే ప్రశ్నకు ప్రభాకర్ రావు నుంచి పొంతనలేని సమాధానాలే వచ్చినట్టు తెలిసింది. సిట్ కొన్ని ఆధారాలను ప్రభాకర్‌రావు ముందుంచుతూ నిగ్గ తీసినప్పటికీ ఆయన నుంచి మౌనమే సమాధామైనట్టు తెలిసింది. అయితే ఎస్‌ఏబీ కార్యాలయంలో చట్టవ్యతిరేకులు మావో యిస్టులు, ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ఆయన సమాధానమిచ్చినట్టు సమాచారం.
మధ్యమధ్యలో తనకు ఆరోగ్యం సరిగా లేదని, చాలా విషయాలు తనకు గుర్తుకురావడం లేదని ప్రభాకర్ చెప్పినట్టు తెలిసింది. ఈ వాతావరణంలోనే సాయంత్రం వరకు విచారించిన అధికారులు విచారణను శనివారానికి వాయిదా వేసినట్టు తెలిసింది. కాగా ప్రభాకర్‌రావును సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించడంతో ఆయనకు ఏసీపీ కార్యాలయంలోని ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి ఉంచినట్టు సమాచారం. ప్రభాకర్‌రావు గది వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నగర శాంతిభద్రతల విభాగం అదనపు కమిషనర్ తప్సీల్ ఎక్బాల్ నవతెలంగాణతో మాట్లాడారు. ప్రభాకర్‌రావును ఏసీబీ కార్యాలయంలోనే జ్యుడీషియల్ కస్టడీలో ఉంచిన్నట్టు తెలిపారు. విచారణ సమయంలో తాను కేవలం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించడానికి మాత్రమే వచ్చానని విచారణలో తాను భాగం కాదని , అంతా సిట్ అధికారులే చూస్తున్నారని అన్నారు.



