Friday, December 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముగిసిన ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ

ముగిసిన ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ

- Advertisement -

నేడు సుప్రీంకోర్టుకు సిట్‌ నివేదిక
న్యాయస్థానాన్ని మరింత గడువు కోరే అవకాశం

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ గడువు గురువారంతో ముగిసింది. గత ఏడ్రోజులుగా జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు విచారించారు. ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో సాగిన ఈ విచారణలో ప్రభాకర్‌రావు నుంచి సాధ్యమైనంత వరకు ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో నిజాలను బయటకు లాగడానికి దర్యాప్తు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఏసీపీ కార్యాల యంలోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో నిందితుడికి బస ఏర్పాటు చేసి మరీ విచారించారు. ఈ ఏడ్రోజులు భోజనంతో పాటు ఆయన ఆరోగ్యానికి అవసరమైన ఔషధాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇంటి నుంచే తెప్పించారు. విచారణ సమయంలో నిందితుడి తరఫు న్యాయవాది కూడా ఆయన సమక్షంలోనే ఉన్నారు. మొత్తమ్మీద తన ఆదేశాల మేరకో లేదా తన పైసీనియర్‌ అధికారుల ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ట్యాపింగ్‌ జరిగిన మాట నిజమేనని ప్రభాకర్‌రావు అంగీకరించినట్టు దర్యాప్తు వర్గాల నుంచి తెలిసింది.

ముఖ్యంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు అవసరమై సాంకేతిక పరిజ్ఞానాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎస్‌ఐబీ కార్యాలయంలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకొని తన సబార్డినేట్‌ అధికారులు ఉపయోగించడాన్ని కూడా ప్రభాకర్‌రావు అంగీకరించినట్టు సమాచారం. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు మొదలుకొని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వరకు పలువురు విపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, కొందరు జడ్జిల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిన వ్యవహారంపై సిట్‌ అధికారులు ప్రభాకర్‌రావును విచారించినట్టు తెలిసింది. అలాగే ఆయన కింద సబార్డి నేట్‌లుగా పని చేసిన డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు బుజంగరావు, తిరుపతయ్య, నగర టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీజీపీ రాధాకిషన్‌రావులను విచారించిన అంశాలలో ప్రభాకర్‌రావుకు సంబంధించి బయటపడ్డ అంశాలను కూడా ముందుంచి ప్రశ్నించారు.

మొత్తమ్మీద ఫోన్‌ట్యాపింగ్‌కు కారకులైన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని కీలక నేతలు ఎవరన్న విషయంలో మాత్రం ప్రభాకర్‌రావు నుంచి ఎలాంటి సమాచారాన్నీ సిట్‌ రాబట్టలే కపోయిందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడు రోజుల పాటు ప్రభాకర్‌రావు నుంచి రాబట్టిన సమాచారం, అందుకు అవసరమైన ఆధారాలను క్రోడీకరిస్తూ సుప్రీంకోర్టుకు శుక్రవారం సిట్‌ అధికారులు నివేదికను సమర్పించనున్నారని సమాచారం. ఇంకా కీలకమైన విషయాలను ప్రభాకర్‌రావు ఉద్దేశపూర్వకంగా దాస్తున్నారనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు సిట్‌ తెలియజేయనున్నదని తెలిసింది. ఈ మేరకు ప్రభాకర్‌రావును విచారించడానికి మరింత అదనపు గడువును, అవసరమైతే లైడిటెక్టర్‌ టెస్ట్‌ను నిర్వహించడానికి అనుమతిని కోరే అవకాశమున్నదని సమాచారం. కాగా వారం పాటు సిట్‌ జరిపిన విచారణపై నగర పోలీస్‌ కమిషనర్‌ వి.సి సజ్జనార్‌ గురువారం సమీక్షించారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో సిట్‌ సమర్పించిన ప్రభాకర్‌రావు వారం రోజుల కస్టోడియల్‌ నివేదికపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపనున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -