కొన్ని ప్రశ్నలకు నేరుగా సమాధానాలివ్వని మాజీ ఐజీ
ఫోన్‌ట్యాపింగ్ అసలు సూత్రధారుల కోసం సిట్ ప్రయత్నాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావును సిట్ అధికారులు శనివారం రెండో రోజు విచారించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏడ్రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకున్న ప్రభాకర్‌రావు నుంచి అసలు నిజాలను రాబట్టడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండో రోజు సైతం సిట్ వేసిన కొన్ని ప్రశ్నలకు ప్రభాకర్‌రావు నుంచి నేరుగా సమాధానాలు రాలేదని తెలిసింది. ముఖ్యంగా ఫోన్‌ట్యాపింగ్ డివైజ్‌లు, హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకరోజు ముందే ధ్వంసం చేయాలని ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రవీణ్‌రావుకు ఎవరు ఆదేశాలిచ్చారు అనే విషయమై మాజీ ఐజీ నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చినట్టు సమాచారం. కొన్ని హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయడానికి తానే అనుమతిచ్చినట్టు అంగీకరించిన ప్రభాకర్‌రావు.. అవి పూర్తిగా తన సొంతమనీ, ప్రభుత్వ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదని సమాధానమిచ్చాడు.
దాదాపు నాలుగు వేల మందికి పైగా ప్రముఖులతో పాటు కొందరు న్యాయమూర్తుల ఫోన్‌లను కూడా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అధికారులు ప్రశ్నించగా.. ఆయన మౌనం వహించినట్టు సమాచారం. ఈ ఫోన్‌ట్యాపింగ్‌లను జరపడానికి తనకు సన్నిహితులైన అధికారులను ఎస్‌ఐబీలో నియమించుకోవడం నిజమేనా అనే ప్రశ్నకు అవసరమైన సందర్భంలో తమకు నమ్మకమున్న అధికారులకు కీలకమైన బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని ప్రభాకర్‌రావు సమాధానమిచ్చినట్టు తెలిసింది. మొత్తమ్మీద తాను జరిపిన ఫోన్‌ట్యాపింగ్‌ల విషయంలో సీనియర్ అధికారుల నుంచి అవసరమైన ఆదేశాలను తీసుకోవడం జరిగిందని కూడా ప్రభాకర్‌రావు చెప్పినట్టు సమాచారం. ట్యాపింగ్ జరపడానికి అప్పటి ప్రభుత్వంలో ఎవరి నుంచి ఆదేశాలు అందుకున్నారనే విషయం మాత్రం ఆయన నోరు మెదపలేదని తెలిసింది.
రెండో రోజు ముగిసిన ప్రభాకర్‌రావు విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



