Sunday, December 21, 2025
E-PAPER
Homeఅంతరంగంప్రశంస

ప్రశంస

- Advertisement -

ప్రశంసను ఆస్వాదించడం కూడా ఓ కళ. జీవితంలో మనం ఏదైనా విజయాలు సాధించినప్పుడు దాన్ని గుర్తించి మనల్ని ఎవరైనా ప్రశంసిస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా ఏదో సాధించాలనే కొత్త ఉత్సుకత మనలో కలుగుతుంది. కానీ మనల్ని గుర్తించేవారు, మన గురించి నాలుగు మంచి మాటలు చెప్పేవారు లేకపోతే మంచి పని చేయాలన్న ఉత్సాహం పోతుంది. అందుకే ఎదుటివారు ప్రశంసిస్తున్నప్పుడు వారిని అడ్డుకోవడం, ఆ పొగడ్తలను స్వీకరించే హక్కు లేదన్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదు.

ఎంత గొప్పవారికైనా సరే చిన్న కంగ్రాట్యులేషన్స్‌ అనే పదం చాలా గొప్పగా పని చేస్తుంది. ‘నీ వల్లే ఈ ప్రాజెక్ట్‌ ఇంత విజయవంతమైంది’ అని ఎవరైనా మిమ్మల్ని ప్రశంసిస్తే ఏం చేస్తారు. స్నేహితులు ఇలా అంటే కొందరు ‘మునగచెట్టు ఎక్కించకు’ అంటూ ఆ ప్రశంసను కొట్టిపడేస్తారు. అదే మన అధికారులు పొగిడితే ఆ మాటలను దాటవేయడమో, లేదా నవ్వి వూరుకోవడమో చేస్తుంటారు. ‘అదేం లేదులేండీ’ అంటూ తమ శ్రమను, విజయాన్ని తక్కువ చేసుకొని మాట్లాడతారు. ఇది సరైన పద్ధతి కాదు.

ఎవరైనా మనల్ని ప్రశంసించినపుడు దాన్ని అంగీకరించి ధన్యవాదాలు చెప్పాలి. అంతేకాదు మీరు ఆ పనిని విజయవంతం చేయడంలో మీకు సహకరించిన వారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. దీనివల్ల వారు కూడా ఆనందంగా ఫీలవుతారు. మీరు కష్టపడి పని చేసినప్పుడు ఎదుటివాళ్లిచ్చే ప్రశంసలను పొందే హక్కు మీకు ఉంటుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మరింత ఉత్సాహాన్ని పొందండి.

ఎదుటి వాళ్లు ప్రశంసిస్తుంటే కొందరు ముడుచుకుపోతుంటారు. మరికొందరైతే తామే గ్రేట్‌ అన్నట్టుగా హావభావాలను ప్రదర్శిస్తుంటారు. అయితే ఈ రెండూ పద్ధతులు మంచివి కావు. ఎదుటివారు మిమ్మల్ని ప్రశంసిస్తున్నపుడు చిరునవ్వుతో, హుందాగా దాన్ని స్వీరించడం నేర్చుకోవాలి. దీనివల్ల అవతలి వ్యక్తికి కూడా మీపై సదభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే ఎదుటివారు మీ గురించి ప్రశంసాపూర్వకమైన మాటలు మాట్లాడుతుంటే కాళ్లు వూపడం, చేతులు నలుపుకోవడం, ఎటో చూస్తుండటం వంటివి కూడా చేయకూడదు. వారి కళ్లలోకి చూస్తూ ప్రశంసలు స్వీరించాలి.

మిమ్మల్ని పై అధికారులు ప్రశంసిస్తుంటే బాగానే ఉంటుంది. అయితే మీకింది వారికి అదే అవకాశం దక్కాలని వారూ కోరుకుంటారు. అందుకే మిమ్మల్ని ప్రశంసిస్తుంటే ముందు వారికి ధన్యవాలు తెలిపి.. మీరు ఆ విజయం సాధించడంలో మీకు సహాయం చేసిన మీ బృంద సేవలను కూడా గుర్తించండి. అందరిలోనూ వారిని ప్రశంసించడం మర్చిపోవద్దు. నలుగురిలో మాట్లాడేటప్పుడు విజయానికి మీరొక్కరే కారణమని చెప్పకుండా మీ బృంద సహకారం గురించి వివరించడం వల్ల వారికీ సంతోషం, ప్రోత్సాహం అందించిన వారు అవుతారు.

అలాగని మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించకపోయినా, ప్రశంసించకపోయినా నిరుత్సాహపడకండి. అందరూ మనల్ని ప్రశంసించాలని కూడా అనుకోవద్దు. మీపై అసూయపడేవారు మీ విజయాన్ని గుర్తించినా నలుగురిలో అంగీకరించడానికి ఇష్టపడరు. అలాంటి వారిని పట్టించుకోకండి. ఎవరైనా ప్రశంసిస్తే మాత్రం ఆపకండి. ఆ ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -