Monday, December 15, 2025
E-PAPER
Homeజాతీయంప్రణవ్‌అదానీకి క్లీన్‌చిట్‌

ప్రణవ్‌అదానీకి క్లీన్‌చిట్‌

- Advertisement -

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు కొట్టివేత
సెబీ నిర్ణయం వెనుక పలు సందేహాలు

న్యూఢిల్లీ : భారత స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ).. అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రణవ్‌ అదానీపై ఉన్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలను కొట్టివేసింది. ఇందుకు ఎలాంటి ఆధారాలూ లేవని తేల్చింది. ఈ మేరకు ఆయనతో పాటు ఇతరులపై కొనసాగుతున్న విచారణను ముగిస్తున్నట్టు సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. సెబీ తన స్వతంత్రత విషయంలో ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇలాంటి తరుణంలో సెబీ తాజా నిర్ణయం సర్వత్రా పలు సందేహాలను కలిగిస్తున్నది.

కేసు నేపథ్యం?
2021లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజెల్‌).. యూఎస్‌కు చెందిన ఎస్‌బీ ఎనర్జీ హౌల్డింగ్స్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం స్టాక్‌ మార్కెట్‌లో కీలకమైన సమాచారం (యూపీఎస్‌ఐ)గా పరిగణించబడింది. ఈ సమాచారం పబ్లిక్‌కు తెలియకముందే కొందరు వ్యక్తులు షేర్లలో ట్రేడింగ్‌ చేసి లాభాలు పొందారనే అనుమానంతో సెబీ విచారణ ప్రారంభించింది. ప్రణవ్‌ అదానీ.. ఈ డీల్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని తన సన్నిహితులకు తెలియజేశారనీ, ఆ సమాచారం ఆధారంగా కొందరు వ్యక్తులు అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లను కొనుగోలు చేసి లాభాలు పొందారని ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలు.

అయితే ఈ కేసులో సెబీ సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఆరోపణలకు కేంద్రంగా ఉన్న ఫోన్‌ కాల్స్‌, సంభాషణల్లో ఇన్‌సైడర్‌ సమాచార మార్పిడి జరిగినట్టు తేలలేదని వివరించింది. ఆ సమయంలో డీల్‌కు సంబంధించిన వివరాలు ఇప్పటికే మీడియా కథనాల ద్వారా పబ్లిక్‌ డొమైన్‌లోకి వచ్చాయనీ, అందువల్ల వాటిని యూపీఎస్‌ఐగా పరిగణించలేమని సెబీ అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో ప్రణవ్‌ అదానీతో పాటు ఇతరులపై విధించాల్సిన జరిమానాలు, శిక్షల ప్రశ్న ఉత్పన్నం కాలేదు. కేసును పూర్తిగా ముగిస్తూ సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు అదానీ గ్రూప్‌పై ఉన్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనుమానాలకు తాత్కాలికంగా ముగింపు పలికినట్టయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బడా కార్పొరేట్లకు అనుకూలంగా సెబీ చర్యలు?
సెబీ స్వతంత్రతపై ఇప్పటికే ప్రతిపక్షాలు, పౌర సమాజం ఆందోళనలు వ్యక్తం చేశాయి. సెబీ.. ప్రభుత్వానికి, బడా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలను చేశాయి. ముఖ్యంగా గౌతమ్‌ అదానీ విషయంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత సెబీ-అదానీ వ్యవహారాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. అప్పటి సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురి బుచ్‌, ఆమె భర్తపై స్వార్థపూరిత ప్రయోజనాల ఆరోపణలు వచ్చాయి. ఇక సెబీ గతంలో చిన్న పెట్టుబడిదారులపై కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ కార్పొరేట్‌ దిగ్గజాల విషయంలో మాత్రం అదే కఠినత్వాన్ని చూపటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు తాజా పరిణామమే ప్రత్యక్ష ఉదాహరణగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇలాంటి చర్యలతో సెబీ నిష్పాక్షితతపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -