– ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి : సీఐటీయూ
– సీఎం రేవంత్‌రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్కకు లేఖలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రీప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలనీ, విద్యాబోధన బాధ్యతను అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇవ్వాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) అనుబంధం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సునీత, పి.జయలక్ష్మి, కోశాధికారి పి.మంగ డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్కకు మెయిల్, వాట్సాప్ ద్వారా లేఖలు పంపారు. విద్యావాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అంగన్‌వాడీలకు అదనంగా ఇవ్వాలని కోరారు. ఆరేండ్ల లోపు పిల్లలకు ప్రయివేటు స్కూళ్లను నడపడానికి అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఐసీడీఎస్‌కు సంబంధంలేని బీఎల్‌ఓ తదితర అదనపు పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1975లో ప్రారంభమైన ఐసీడీఎస్ దేశ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందిందని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఐఎల్‌సీతో పాటు కాగ్, యునిసెఫ్ తదితర సంస్థలు సిఫారసు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2022లో సుప్రీం కోర్టు అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ చెల్లించాలనీ, 2024లో గుజరాత్ హైకోర్టు వారిని పర్మినెంట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 1995 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను పౌష్టికాహారంతో పాటు విద్యను అందించే ఈసీసీఈ కేంద్రాలు(ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్)గా మార్చాలని అంగన్‌వాడీలు అడుగుతున్నారనీ, దానికి ఆటంకంగా ఉన్న బీఎల్‌ఓ, ఐసీడీఎస్‌కు సంబంధం లేని అదనపు పనులు రద్దు చేయాలని కోరుతున్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా ఐసీడీఎస్‌లను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తగదని సూచించారు. ఇంటర్మీడియట్‌తో పాటు ఆపై చదువులు చదివిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త విద్యావాలంటీర్లను నియమిస్తామనటం సబబు కాదని పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రయివేటు స్కూళ్లు నడపడానికి అనుమతి ఇవ్వకూడదని కోరారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని కోరారు.
ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES