Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeమానవిప్రసవ‌పూర్వ సంరక్షణ తల్లీబిడ్డల క్షేమం

ప్రసవ‌పూర్వ సంరక్షణ తల్లీబిడ్డల క్షేమం

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా మాతృత్వాన్ని ప్రకృతి, స్త్రీకి ప్రసాదించిన వరంగా పరిగణిస్తారు. తన గర్భంలో రూపుదిద్దుకుంటున్న బిడ్డపట్ల ప్రతి మాతృమూర్తికి సహజంగానే అనురాగం పెల్లుబుకుతుంది. ఇది కేవలం నాభితీగ అనుసంధానం మాత్రమే కాదు. మానసిక, శారీరిక ప్రక్రియలతో ముడిపడి ఉన్న బంధం. ప్రకృతిసిద్ధంగా ఆడపిల్లల్లో మాతృత్వపు ఛాయలు, తల్లిదండ్రుల పట్ల, సహోదరీసహోదరుల పట్ల వాత్సల్యరూపంలో చిన్నతనం నుండే తొంగిచూస్తూనే ఉంటాయి. అటు వంటి వైఖరి సహజంగానే ఉన్న స్త్రీ తాను తల్లి కాబోయే తరుణంలో గర్భధారణ పరంగా తనలో జరిగే శారీరిక, మానసిక మార్పులకు ఎన్నోరకాలుగా తన జీవనశైలిని మలుచుకోవల్సి వస్తుంది. తన ఆరోగ్యం పట్ల ఎంతోశ్రద్ధ వహించవల్సి వస్తుంది. తల్లి ఆరోగ్య సంరక్షణే పుట్టబోయే బిడ్డకు రక్షణ కవచం. దానికి కుటుంబసభ్యుల, సహచరుల, సన్నిహితుల, స్నేహితుల సహకారం చాaవ అవసరం. తల్లీ బిడ్డ ఆరోగ్య దృష్ట్యా వారి సంరక్షణను ప్రసూతిపూర్వ, ప్రసూతిసమయ, ప్రసూతి అనంతరం.. ఇలా మూడు దశలుగా విభజించవచ్చు. ప్రసూతిపూర్వ సంరక్షణపై పాఠకులకు ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. ఈ వారం మనకున్న అవగాహనను ఇంకొంత పెంచుకునే ప్రయత్నం చేద్దాం.

గర్భధారణ తదుపరి తొమ్మిది నెలలు తల్లీ బిడ్డలకు సురక్షిత పరిస్థితులు నెలకొల్పి సునాయాస ప్రసవం ద్వారా తల్లి ఆరోగ్యానికి భంగం కలిగించకుండా ఆరోగ్యపూరితమైన బిడ్డకు జన్మనిచ్చేలా చూడాలి. ఈ ప్రక్రియ అభివృద్ధి చెందిన దేశాల్లో వివాహానికి పూర్వమే పరిశీలనా పరీక్షలు, తగు సలహా ప్రక్రియల (ప్రీ మారిటల్‌ కౌన్సిలింగ్‌) ద్వారా భావి తల్లితండ్రులను, వారు చేపట్టబోయే బాధ్యతల పరంగా వారిని మానసికంగా జాగురూకులుగా చేస్తారు. ఉదాహరణకి కాబోయే తల్లికి చిన్నతనం నుండే మధుమేహం ఉంటే, ఆమె పట్ల కుటుంబ సభ్యులు ముందుగానే అప్రమత్తమై, గర్భం దాల్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల జాగరూకత వహించడానికి అవకాశముంటుంది. ప్రస్తుతం ఈ రకమైన వైద్యవైఖరి మన దేశంలో సంపన్న వర్గాల వరకే పరిమితమై ఉన్నది.

మొదటి సంప్రదింపులో…
సామాన్యంగా ఈ రోజుల్లో గర్భధారణ నిర్ధారణ ఇంటిలోనే బీటా హెచ్‌.సి.జి. హోమ్‌ కిట్‌ ద్వారానో లేక క్రమంతప్పని రుతుస్రావం కలిగే మహిళ తన నెలసరి తేదీ దాటిపోయిందని వైద్యసంప్రదింపుకు వెళ్లడంతో ప్రసవ పూర్వ సంరక్షణ మొదలౌతుంది. వైద్య సలహాపై లాబరేటరీలో మూత్ర, రక్త పరీక్ష లేదా స్కాన్‌ ద్వారానో గర్భధారణ నిర్ధారణ తర్వాత మొదటి వైద్య సంప్రదింపులో భాగంగా మహిళ సహజ ఆరోగ్య స్థితి, ఆమెకు అప్పటికే ఏవైనా జబ్బులు, వాటి పరంగా ఎటువంటి మందులు వాడుతున్నది, ఆమె మానసిక, ఆర్థిక, సాంఘిక స్థితిగతులు వంటి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని అందుకనుగుణంగా ఆమెకు, గర్భంలోని శిశువుకు ఎటువంటి సంరక్షణ అవసరమో, అది ఒక ప్రణాళిక పూర్వకంగా వైద్యులు తయారుచేస్తారు. దాన్ని ఆ మహిళ, ఆమె కుటుంబసభ్యుల పర్యవేక్షణలో, సమ్మతిపూర్వకంగా, క్రమంతప్పకుండా, అవలంబించవల్సి ఉంటుంది.

తప్పనిసరిగా జరిపించాల్సినవి
మహిళ సహజ ఆరోగ్య స్థితిగతుల నిర్ధారణ కొరకు కొన్ని పరీక్షలు తప్పనిసరిగా జరిపించాల్సి ఉంటుంది. రక్తహీనతను తెలియజేసే రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్యా, హిమోగ్లోబిన్‌ మోతాదు, బ్లడ్‌ గ్రూప్‌, ఆర్‌ హెచ్‌ టైపింగ్‌, బ్లడ్‌ గ్లూకోస్‌, తల్లికి అంతగా హాని చేయకపోయినా, బిడ్డ పరంగా తీవ్ర పరిణామాలు కలిగించగలిగే కొన్ని అంటువ్యాధుల కొరకు (టి.ఓ.ఆర్‌.సి.ఎచ్‌: స్క్రీనింగ్‌), కాలేయ, మూత్ర సంబంధిత పరీక్షలు, వంటివి వైద్య సలహా మేరకు చేయవలసి ఉంటుంది. వీటిని ఆంటీనేటల్‌ కేర్‌ ప్రొఫైల్‌ అని అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూఎచ్‌ఓ), సామాన్యంగా నాలుగు నుండి ఎనిమిది సార్లు ప్రసవపూర్వ వైద్యసంప్రదింపులను సూచిస్తుంది. గర్భంలో శిశువృద్ధి పరంగా ప్రసవపూర్వ కాలాన్ని నలభై వారాలుగా, తల్లిపరంగా మూడు త్రైమాసికాలుగా పేర్కొంటారు. మొదటి త్రైమాసికంలో ఒకసారి, రెండవ త్రైమాసికంలో ఇరవైనాలుగు నుండి ముప్పై వారాల మధ్యలో నెల ఎడంతో, రెండు సార్లు, చివరి త్రైమాసికంలో, రెండేసి వారాల ఎడంతో, కనీసం ఐదు సార్లు (తల్లీబిడ్డ ఆరోగ్యరీత్యా ఎక్కువసార్లు కూడా కావచ్చు), గర్భవైద్య నిపుణుల సంప్రదింపు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.

సంప్రదింపులతో ప్రయోజనాలు
ప్రసవపూర్వ సంరక్షణ తల్లీబిడ్డలకు సరైన పద్ధతిలో అందచేయాలంటే పైన పేర్కొన్న విధంగా క్రమం తప్పని వైద్యసంప్రదింపుల ద్వారా మాత్రమే వీలౌతుంది. సమయానుసారంగా రక్త, మూత్ర పరీక్షలు, తద్వారా రక్తహీనత, మూత్రపరమైన అంటువ్యాధి, మధుమేహవ్యాధి వంటివి గుర్తించి వాటి చికిత్సకు చర్యలు చేపట్టటం, జన్యుపర జబ్బులను కనుగొనడానికి తగు అమ్నియోటిక్‌ ఫ్లూయిడ్‌ పరీక్షలు, అల్ట్రా సౌండ్‌ ద్వారా బిడ్డ పెరుగుదల, కదలికలు, హృదయ స్పందనలు వంటి అతి కీలక పర్యవేక్షణ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండటం వలన, గర్భధారణ ఆద్యంతమూ సఫలీకృతమై, తల్లి ఆరోగ్యం ఏ మాత్రమూ క్షీణించకుండా, సుఖ ప్రసవం జరిగి, సంపూర్ణంగా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువ.

సకాలంలో గుర్తిస్తే…
తల్లీ బిడ్డల ఆరోగ్య స్థితిపై నిరంతర పర్యవేక్షణ, ఆహార/సూక్ష్మ పోషకాల కొరతను సకాలంలో గుర్తింపు, వాటిని సరిచేసే చికిత్సా ప్రయత్నాలు, ఆల్ట్రాసౌండ్‌ ద్వారా గర్భంలోని శిశు లోపాల్ని గుర్తించగలగడం, కవలలు లేదా బహుళ శిశువుల వంటివి కనుక్కోవడానికీ, సమస్యలకి పరిష్కార మార్గాలు, తగు చికిత్స చేపట్టడానికి అవకాశం కలుగుతుంది. సమస్యలతో కూడుకున్న గర్భధారణ (ప్రెగన్సీ విత్‌ కాంప్లికేషన్స్‌)ను, ఆరంభదశలోనే గుర్తించగలగడం, సరైన చికిత్సామార్గాలు ఎన్నుకోవడం, శిశువు పెరుగుదలను పర్యవేక్షించడం, టీకాలు సమయాను కూలంగా ఇవ్వగలగడం, తల్లికి సరైన పోషకాహారం, సప్లిమెంట్స్‌ అందేటట్టు చూడడం, దీర్ఘ కాలిక వ్యాధులను పర్యవేక్షించడం, అంటువ్యాధులనుండి, నిర్జీవ (స్టిల్‌బర్త్‌)/ముందస్తు జననం(ప్రీ టర్మ్‌ బర్త్‌)వంటివి కాకుండా కాపాడడం వంటి సున్నిత విషయాలను సమర్థవంతంగా సంబోధించడానికి ప్రసవపూర్వసంరక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి.

సంతోషభరిత వాతావరణంలో…
కాబోయే తల్లికి ప్రసవపూర్వ సంరక్షణ ఎంతో మానసికాహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆల్ట్రాసౌండ్‌ మానిటర్‌పై గర్భంలో పెరుగుతున్న తన బిడ్డరూపం, కదలికలు చూసినప్పుడు, గుండె చప్పుళ్ళు విన్నప్పుడు ఆమె ఆనందం వర్ణనాతీతం! సంతోషభరిత వాతావరణంలో ఆ మాతృమూర్తి చక్కని బిడ్డకు జన్మనిస్తుంది! తల్లీబిడ్డల క్షేమం కోరే ప్రతి కుటుంబంలోని భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు, తోబుట్టు వులు, ఇతర బంధువులు, ఎవరూ లేని ఒంటరి స్త్రీకి సమాజం.. అందరూ కలసి ఈ రకమైన ప్రసవపూర్వసంరక్షణ అందచేయడానికి ప్రయత్నిస్తారని, సుముఖత చూపుతారని ప్రఘాడంగా విశ్వసిస్తున్నాను.

  • డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad