నవతెలంగాణ-హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాఫేల్ యుద్ధవిమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుండి ఆమె రాఫెల్‌లో విహరించారు. వాయుసేన చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ జెట్‌లను వినియోగించారు. ఫ్రాన్స్ ఏరోస్పేస్ మేజర్ డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలను 2020 సెప్టెంబర్‌లో అంబాలాలోని వైమానిక దళ స్టేషన్‌లో అధికారికంగా భారతవైమానికదళంలోకి ప్రవేశపెట్టారు.
మాజీ రాష్ట్రపతులు ఎపిజె.అబ్దుల్ కలాం మరియు ప్రతిభా పాటిల్‌లు సుఖోయ్ -30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. 2023 ఏప్రిల్ 8న భారత సాయుధ దళాల కమాండర్ ముర్ము అస్సాంలోని తేజ్‌పూర్ వైమానిక దళ స్టేషన్‌లో సుఖోయ్ -30 ఎంకెఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. సుఖోయ్-30 యుద్ధ విమానంలో ప్రయాణించిన మూడవ రాష్ట్రపతి మరియు రెండవ మహిళగా ముర్ము నిలిచారు.
’’భారత రాష్ట్రపతి ముర్ము బుధవారం హర్యానాలోని అంబాలాను సందర్శిస్తారు. అక్కడ ఆమె రాఫెల్‌లో ప్రయాణించనున్నారు” అని రాష్ట్రపతి భవన్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.



