Monday, November 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ జేఏసీ డిమాండ్‌
బీజేపీ ద్వంద్వ వైఖరిని వీడాలి
బషీర్‌ బాగ్‌ చౌరస్తా నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు ‘రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌’ ర్యాలీ

నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ముందుకెళ్లితే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్‌ చైర్మెన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు. నేడు జరిగే క్యాబినెట్‌ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి, ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్ళడానికి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘రన్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌’ పేరుతో రన్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌, బషీర్‌ బాగ్‌ చౌరస్తాలో ఉన్న బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం నుంచి ట్యాంక్‌ బండ్‌ వద్ద గల డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వరకు రన్‌ నిర్వహించారు.

ఈ రన్‌లో బీసీ ఉద్యమకారులతో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మెన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, చీప్‌ కో-ఆర్డినేటర్‌ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్‌ కుందారం గణేష్‌ చారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం గత రెండు ఏండ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం బాగా కృషి చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఒక రాజకీయ కార్యాచరణ నిర్ణయించుకుని డిసెంబర్‌ 1వ తేదీ నుండి జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని, ఇండియా కూటమి ద్వారా పార్లమెంటును స్తంభింప చేయాలన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో గెలిచామనే సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామంటే బీసీలను నమ్మించి మోసం చేయడమే అవుతుందన్నారు. ఇంకో 14 రోజులు ప్రభుత్వం ఓపిక పడితే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించని బీజేపీని బీసీ సమాజం ముందు దోషిగా నిలబెట్టవచ్చునని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ ద్వంద్వ వైఖరి విడనాడాలన్నీరు.

పార్లమెంటులో ఆమోదించకుంటే వేలాది మందితో చలో ఢిల్లీ నిర్వహించి పార్లమెంటును ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు అమలు కాకుంటే భవిష్యత్తులో ఇంకెప్పుడు అమలు జరిగే పరిస్థితి లేదన్నారు. వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ సర్పంచ్‌ ఎన్నికలు ఆగిపోతే కేంద్రం నుండి రావలసిన నిధులు రావడం లేదని చెబుతున్న ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్‌ లో రూ.3,000 వేల కోట్లు ఆగిపోతే వచ్చే నష్టం ఏంతన్నారు. కేంద్రంతో కొట్లాడడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైతే, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిఘ సంఘాల బీసీ నేతలు శ్రీనివాస్‌, వీరస్వామి, తాటికొండ విక్రమ్‌ గౌడ్‌, వేముల రామకృష్ణ, కనకాల శ్యామ్‌ కుర్మ, ఉప్పరి శేఖర్‌ సగర, దిటి మల్లయ్య, పిట్ల శ్రీధర్‌, ఈడిగ శ్రీనివాస్‌ గౌడ్‌, వరికుప్పల మధు, నిరంజన్‌, పాలకూరి కిరణ్‌ గౌడ్‌, మాదేశి రాజేందర్‌, తారకేశ్వరి, సంధ్యారాణి, గౌతమి, స్వామి గౌడ్‌, ఇంద్ర, మహేష్‌, భరత్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -