– రెండు వేర్వేరు కేసుల్లో ఊరట
న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థకు రెండు వేర్వేరు కేసుల్లో ఢిల్లీ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విదేశీ నిధులు స్వీకరించారంటూ ఢిల్లీ పోలీసులు పెట్టిన కేసు కూడా ఇందులో ఒకటి. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు చేస్తున్న మనీ లాండరింగ్ కేసులో కూడా పుర్కాయస్థకు ఉపశమనం లభించింది. ఈ కేసులు 2020లో నమోదయ్యాయని కోర్టు పేర్కొంది. కానీ ఇప్పటివరకు దర్యాప్తులేవీ పూర్తి కాలేదని, చార్జిషీట్ దాఖలు కాలేదని కోర్టు పేర్కొంది. ”దర్యాప్తులకు హాజరు కావాల్సిందిగా దరఖాస్తుదారుని 2023 నుండి ఇంతవరకు పిలిచిన దాఖలాలు కూడా లేవని పేర్కొంది. దరఖాస్తుదారుడు గౌరవప్రదమైన వ్యక్తి. 75ఏళ్ళకు పైబడిన వృద్ధుడు. సమాజంలో ఆయనకంటూ ఒక హోదా వుంది. వున్న సాక్ష్యాధారాలు ఏవైనా డాక్యుమెంటరీ తరహాలోనే వున్నాయి. కాబట్టి వాటిని తారుమారు చేసే అవకాశాలు లేవు, లేదా సాక్షులను ప్రభావితం చేసేందుకు కూడా అవకాశం లేదు.” అని కోర్టు పేర్కొంటూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అమెరికాలోని వరల్డ్‌వైడ్ మీడియా హోల్డింగ్స్ నుండి రూ.9.59కోట్ల మేరకు విదేశీ నిధులను న్యూస్‌క్లిక్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ స్వీకరించిందని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. డిజిటల్ న్యూస్ వెబ్‌సైట్‌లో 26శాతం ఎఫ్‌డిఐలపై గల పరిమితిని అడ్డుకునేందుకు కంపెనీ షేర్ల విలువను ఎక్కువ చేసి చూపించి, ఈ పెట్టుబడులు పెట్టారని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఈ పెట్టుబడుల్లో 45శాతానికి పైగా మొత్తాలు సిబ్బంది వేతనాలు లేదా కన్సల్టెన్సీ ఫీజులకు, ఇతర ఖర్చులకు మళ్ళించారని కూడా ఆ ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్ ప్రాతిపదికన ఇడి దర్యాప్తు చేపట్టింది. న్యూస్‌క్లిక్ కార్యాలయ ఆవరణల్లో, పలు ఇతర ప్రాంతాల్లో ఇడి సోదాలు నిర్వహించింది. 2021లో ఈ కేసులకు సంబంధించి పుర్కాయస్థ, పాండేలను అరెస్టు చేయకుండా కోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. 2023 అక్టోబరు 3న పుర్కాయస్థను విడిగా యుఎపిఎ కింద నమోదైన వేరే కేసులో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అరెస్టు చేసింది. అయితే పుర్కాయస్థ అరెస్టు చట్టవిరుద్ధమైనదని 2024 మే 24న సుప్రీం కోర్టు ప్రకటించింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది.
పుర్కాయస్థకు ముందస్తు బెయిల్
- Advertisement -
- Advertisement -