నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీహార్ ఓటర్ జాబితా సవరణ, ఈసీ ప్రక్రియపై, ఆపరేషన్ సిందూర్, పాక్-ఇండియా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం తదితర అంశాలపై రచ్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశాలపై ఉభయసభల్లో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు మొదలైన తొలి రోజు నుంచి లోక్, రాజ్యసభలు పలు రోజులనుంచి వాయిదా పడుతు వస్తున్నాయి. దీంతో విపక్షాల డిమాండ్‌కు తలొగ్గిన మోడీ ప్రభుత్వం..ఉభయసభలలో ఆపరేషన్ సిందూర్ పై రెండు రోజుల పాటు చర్చ కొనసాగించింది. ఈ తర్వాత బీహార్ రాష్ట్రంలో ఈసీ చేపట్టిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై చర్చ సాగాలని ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు ఆందోళన చేస్తుండగా..కేంద్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వీరిద్దరూ వేర్వేరుగా భేటీ కావడం వెనుక కారణం ఏమై ఉంటుందోనని సర్వత్రా చర్చ జరిగింది. ఈ క్రమంలో కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్ముకశ్మీర్ (Jammu&Kashmir)కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంపైనే వీరిద్దరూ రాష్ట్రపతితో చర్చించారంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేయగా.. ఈ తేదీకి రెండ్రోజుల ముందే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం కూడా ఈ అంశంపై చర్చకు దారితీశాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు బిహార ఓటర్ల లిస్ట్ పై చర్చకు పార్లమెంటులో విపక్షాలు పట్టుపడుతున్న తరుణంలోనూ ప్రధాని, హోంమంత్రి రాష్ట్రపతిని కలవడం చర్చనీయాంశమైంది.