Friday, July 4, 2025
E-PAPER
Homeజాతీయంసుప్రీం వద్దన్నా 8,350 ఎన్నికల బాండ్ల ముద్రణ

సుప్రీం వద్దన్నా 8,350 ఎన్నికల బాండ్ల ముద్రణ

- Advertisement -

పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా
న్యూఢిల్లీ :
ఎన్నికల బాండ్ల జారీ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా వాటి ముద్రణ కొనసాగింది. ఎన్నికల బాండ్ల ముద్రణను నిలిపివేయాలంటూ 2024 ఏప్రిల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎస్‌బీఐని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 12 రోజుల తర్వాత ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఒక్కొక్కటీ కోటి రూపాయల విలువ కలిగిన 8,350 బాండ్లను ముద్రించారు. ఇందుకు రూ.3.72 లక్షలు ఖర్చు చేశారు. సమాచార హక్కు చట్టం కింద రిటైర్డ్‌ నౌకాదళ అధికారి లోకేష్‌ బత్రా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెలుగు చూసింది.

అయితే ముద్రించిన బాండ్లను విక్రయించలేదు. ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2023 నవంబర్‌ 2న తీర్పును రిజర్వ్‌ చేసింది. అయినా 2024 జనవరి 12న ఒక్కొక్కటీ కోటి రూపాయల విలువ కలిగిన పదివేల బాండ్ల ముద్రణకు నాసిక్‌లోని ఇండియన్‌ సెక్యూరిటీ ప్రెస్‌కు ఆర్డర్‌ ఇచ్చేందుకు ఎస్‌బీఐకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దానికి ఆరు రోజుల ముందు ఎన్నికల బాండ్ల ముద్రణకు ఆర్థిక వ్యవహారాల విభాగాన్ని ఎస్‌బీఐ అనుమతి కోరింది. లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఎన్నికల బాండ్ల కోసం డిమాండ్‌ పెరుగుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. అందుకే బాండ్ల ముద్రణకు అనుమతించాలని కోరింది. జనవరి 12న ఆర్థిక వ్యవహారాల విభాగం నుండి అనుమతి రాగానే అదే రోజు ఎన్నికల బాండ్ల ముద్రణకు ఇండియన్‌ సెక్యూరిటీ ప్రెస్‌కు ఎస్‌బీఐ ఆర్డర్‌ ఇచ్చింది.

ఇది జరిగిన నెల రోజులకు…అంటే 2024 ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఎన్నికల బాండ్ల ముద్రణకు ఎస్‌బీఐ ఆర్డర్‌ ఇచ్చిన రోజే దానిని నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 23న ఆర్థిక వ్యవహారాల విభాగానికి ఎస్‌బీఐ లేఖ రాస్తూ సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌పీఎంసీఐఎల్‌) నుండి 8,350 బాండ్లతో కూడిన నాలుగు బాక్సులు వచ్చాయని తెలియజేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మిగిలిన 1,650 బాండ్ల ముద్రణను నిలిపి వేయాలని (మొత్తం ఆర్డర్‌ ఇచ్చింది 10,000 బాండ్లు) ఎస్‌పీఎంసీఐ ఎల్‌కు తెలియజేయాలని ఎస్‌బీఐకి ఆర్థిక వ్యవహారాల విభాగం సూచించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ ప్రశ్నకు సమా ధానం దొరకడం లేదు. 8,350 ఎన్నికల బాండ్ల ముద్రణ కోసం రూ.3.72 లక్షలు ఎవరు చెల్లించారు?. బత్రా గత నెలలో ఆర్‌టీఐ ద్వారా ఎస్‌బీఐ నుంచి దీనిపై సమాచారం కోరారు. ‘తన వద్ద చాలినన్న బాండ్లు ఉన్నాయని ఎస్‌బీఐ చెప్పింది. అలాంటప్పుడు ముద్రణకు అంత తొందరపాటు ఎందుకు?. సుప్రీంకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వం గట్టిగా నమ్మింది. ముద్రణ ఖర్చును భరించింది పన్ను చెల్లింపుదారులేనన్న విషయాన్ని గ్రహించడం చాలా ముఖ్యం’ అని బత్రా అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -