Monday, November 10, 2025
E-PAPER
Homeజాతీయంజైళ్లలో మగ్గుతున్న ఖైదీలు

జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు

- Advertisement -

నేర నిరూపణ కాకుండానే ఏండ్లుగా కారాగారవాసం
70 శాతానికి పైగా అండర్‌ట్రయల్స్‌ది ఇదే పరిస్థితి
తక్షణ సంస్కరణలు అవసరం : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌

న్యూఢిల్లీ : భారత్‌లో అండర్‌ట్రయల్స్‌ (విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు) సంఖ్య ఆందోళనను కలిగిస్తున్నది. ఇది ఏటికేడూ పెరిగిపోతున్నది. దీంతో నేరారోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది కోర్టులో తుది తీర్పుల కోసం ఎదురు చూస్తూ.. ఏండ్లుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. వీరిలో పేద, అణగారిన వర్గాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇలా చాలా మంది ఖైదీలు తమ కుటుంబాలకు దూరం అవుతుండగా.. మరికొందరు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వారంతా తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. ఇక ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. వీరిలో చాలా మందికి ఉచిత న్యాయసాయం హక్కు ఉందన్న విషయం కూడా తెలియదు. దీంతో బెయిల్‌ కోసం పెద్ద మొత్తంలో డబ్బును వెచ్చిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండర్‌ట్రయల్స్‌ విషయంలో న్యాయనిపుణులు సైతం ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇది న్యాయవ్యస్థలో ఒక మానవీయ వైఫల్యమనీ, తక్షణ సంస్కరణలు అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి విక్రమ్‌ నాథ్‌ అన్నారు. స్క్వేర్‌ సర్కిల్‌ క్లినిక్‌ రూపొందించిన ఓ నివేదిక విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నివేదికలోని అంశాలు
వనితా దేవి (పేరు మార్చాం) తన ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఆరోపణలతో 2017లో అరెస్టయ్యింది. అయితే ఈ నేరాన్ని తాను చేయలేదని ఆమె వాదన. దీని తర్వాత ఆమె కుటుంబం.. ఆమెను వదిలివేసింది. దీంతో ఆమె ఐదేండ్లు జైలులో గడిపింది. చివరికి 2022లో హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ప్రారంభించిన ఫెయిర్‌ ట్రయల్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ)లో భాగమైన స్క్వేర్‌ సర్కిల్‌ క్లినిక్‌ బృందం సహాయంతో ఆమెకు బెయిల్‌ లభించింది. ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఇలా వనితా దేవి లాంటి ఎంతో మంది నేర నిరూపణ కాకుండానే జైలు జీవితాన్ని గడుపుతున్నారు. నల్సార్‌.. ఫెయిర్‌ ట్రయల్‌ ప్రోగ్రామ్‌ కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలు, పుణేలోని యెరవాడ సెంట్రల్‌ జైలు అండర్‌ట్రయల్స్‌తో కలిసి పని చేసింది.

2019-24 మధ్య చేసిన తమ పనికి సంబంధించి తమ నివేదికలో స్క్వేర్‌ సర్కిల్‌ క్లినిక్‌ కొన్ని విషయాలను వెల్లడించింది. ఇది ఇప్పటి వరకు 5,783 అండర్‌ ట్రయల్‌ కేసులను చూసింది. వాటిలో 41.3 శాతం మందికి న్యాయవాది లేకపోవడం, 77 శాతం మందికి కుటుంబ సంబంధాలు తెగిపోవడం, 72 శాతం మందికి పాఠశాల విద్య కూడా పూర్తి కాకపోవడం వంటి పరిస్థితులు బయటపడ్డాయి. అలాగే 51 శాతం మందికి కోర్టు విచారణలకు అవసరమైన పత్రాలు లేవు. ఇక అండర్‌ట్రయల్స్‌లో 52 శాతం మంది 30 ఏండ్ల లోపువారే కావడం గమనార్హం. 58 శాతం మంది కనీసం ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అండర్‌ ట్రయల్స్‌లో 67.6 శాతం మంది వెనుకబడిన కులాలకు చెందినవారు కాగా.. 79.8 శాతం మంది అనధికార రంగంలో పని చేసేవారే కావడం గమనార్హం. కాగా ఐదేండ్లలో స్క్వేర్‌ సర్కిల్‌ క్లినిక్‌ బృందాలు 1834 కేసులో బెయిల్‌ పిటిషన్లు వేసింది. వాటిలో 777 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం 2542 కేసుల్లో 1388 మంది విడుదలయ్యారు.

‘లీగల్‌ ఎయిడ్‌ గురించి తెలియకపోవడం ఆందోళనకరం’
అండర్‌ట్రయల్స్‌కు న్యాయ సహాయం అందించే విధానంలో తక్షణ సంస్కరణలు అవసరమనిజస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ చెప్పారు. భారత జైళ్లలో ఉన్న ఖైదీలలో 70 శాతం మందికి పైగా నేర నిరూపితం కాకుండానే నాలుగు గోడల మధ్య నలుగుతున్నారని అన్నారు. ఈ ఖైదీలకు తమకు ఉచిత న్యాయ సహాయం (లీగల్‌ ఎయిడ్‌) ఉందన్న విషయం కూడా తెలియదనీ, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. 74 శాతం అండర్‌ట్రయల్స్‌లో 7.91 శాతం మంది మాత్రమే న్యాయ సహాయాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. చాలా మంది అండర్‌ట్రయల్స్‌ తమ ఖర్చుతో ప్రయివేటు న్యాయవాదిని నియమించుకుంటారనీ, డబ్బు చెల్లిస్తేనే మంచి పని జరుగుతుందని వారు నమ్ముతారని ఆయన తెలిపారు. ఇక నిందితుడు బెయిల్‌ మొత్తాన్ని చెల్లించలేడనీ, వారికి ష్యూరిటీలు ఇచ్చేవారు కూడా ఉండరని.. దీంతో ఆయన తిరిగి మొదటికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. అయితే నిందితుడిని విఫలం చేసేది వ్యవస్థే కానీ చట్టం కాదని ఆయన తెలిపారు. దేశంలో న్యాయ విద్యను బోధించే విధానంలో కూడా మార్పులు రావాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -