వాణిజ్య తోటల పెంపకానికి మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
పరిశ్రమలకు లాభం..అడవులకు నష్టం.. పర్యావరణ భద్రతకు మరింత ముప్పు : నిపుణుల ఆందోళన
దేశ అటవీ చట్టాలను దెబ్బతీస్తూ మోడీ సర్కారు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. అటవీ భూముల్లో ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు వాణిజ్య తోటలు వేసుకునేందుకు అనుమతిస్తూ సంబంధిత మార్గదర్శకాలకు కీలక సవరణలు చేసింది. నెట్ ప్రజెంట్ వ్యాల్యూ (ఎన్‌పీవీ) చెల్లింపులు, పరిహార అటవీకరణ ఉండకుండా ప్రయివేటుకు మార్గం సుగమం చేసింది. ఈ నిర్ణయం పరిశ్రమలకు లాభం, అడవులకు నష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవవైవిధ్యం నశించే ప్రమాదం ఉన్నదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది అడవుల ప్రయివేటీకరణకు తలుపులు తెరుస్తుందని విమర్శలు వస్తున్నాయి. దేశ పర్యావరణ భద్రతపై దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు దేశంలోని అడవులను ప్రయివేటుపరం చేసేందుకు దారులు సుగమం చేస్తున్నది. భారత్‌లో అటవీ సంరక్షణకు సంబంధించిన చట్టాలను మరింత బలహీనపరుస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్‌సీసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. అటవీ భూముల్లో వాణిజ్య తోటలు ఏర్పాటు చేయడాన్ని ఇకపై ‘అటవీ కార్యకలాపాలు’గా పరిగణిస్తూ.. వాటికి నెట్ ప్రజెంట్ వ్యాల్యూ (ఎన్‌పీవీ) చెల్లింపు, పరిహార అటవీకరణ వంటి రక్షణ చర్యలను తొలగించింది. 2023లో అమల్లోకి వచ్చిన వన్ (సంరక్షణ మరియు అభివృద్ధి) అధినియం మార్గదర్శకాలకు ఈనెల 2న సవరణలు చేసింది. ఈ సవరణ పరిశ్రమలకు మేలు, అడవుల జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించేదిగా ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వన్ (సంరక్షణ ఎవమ్ సంవర్ధన్) అధినియంను గతంలో వన సంరక్షణ చట్టం (మునుపటి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్-ఎఫ్‌సీఏ)గా పిలిచేవారు. తాజా చట్టం కింద జారీ చేసిన 2023 నాటి మార్గదర్శకాలకు ఈనెల 2న సంబంధిత మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఒక సవరణ ద్వారా తాజా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అడవుల్లో వాణిజ్య తోటలను ఏర్పాటు చేయడానికి మరిన్ని సడలింపులు ఇచ్చినట్టయ్యింది. ఇప్పటి వరకు అడవి భూమిని లీజుకు తీసుకొని తోటలు వేయాలంటే అది ‘అటవీయేతర కార్యకలాపం’గా పరిగణించబడేది. అలాంటి సందర్భాల్లో ప్రయివేటు లేదా ప్రభుత్వ సంస్థలు తప్పనిసరిగా పరిహార అటవీకరణ చేయాలి. అలాగే ‘కంపా’కు ఎన్‌పీవీ చెల్లించాల్సి ఉండేది. కానీ తాజా సవరణతో ఈ రెండింటినీ కేంద్రం పూర్తిగా తొలగించింది.
నిపుణుల ఆందోళనలు
కేంద్రం నిర్ణయంపై పర్యావరణవేత్తలు, నిపుణుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ”వాణిజ్య తోటలు అడవులు కావు. ఇవి జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తాయి. ఈ మార్పు జీవ సంరక్షణ లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధం” అని పర్యావరణవేత్త రిత్విక్ దత్తా అన్నా రు. ”నిబంధనలను మరింత సడలించారు. పరిశ్రమలకు లాభం చేకూర్చేందుకే ఈ మార్పును తీసుకొచ్చారు. దేశ పర్యావరణ భద్రతకు ఇది ప్రమాదకరం” అని మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రకృతి శ్రీవాస్తవ తెలిపారు. ”ప్రయివేటు సంస్థలు వేగంగా పెరిగే యూకలిప్టస్, టీక్ వంటి చెట్లనే పెంచుతాయి. ఇవి వన్యప్రాణులకు అవసరమైన పొదలు, మృత వృక్షాలు, సహజ నిర్మాణాన్ని కలిగి ఉండవు. ఒక తోట ఎన్నటికీ అడవి కాలేదు” అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఈ నిర్ణయం దేశంలోని అడవులకు విపత్తు కలిగిస్తుందని మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి ఆర్‌పీ బాల్వాన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పరిశ్రమల ప్రయోజనం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనీ, 1980 నుంచి కార్పొరేట్లు అడవీ భూమిపై కన్నేశాయని అన్నారు. తాజా నిర్ణయంతో వాటికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు.
రాజకీయ దుమారం
కేంద్రం నిర్ణయం ఇటు రాజకీయంగానూ తీవ్ర దుమారాన్నే రేపుతున్నది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తాజా మార్పులను తీవ్రంగా తప్పుబట్టారు. 2023లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ సవరణల సమయంలోనే అడవుల ప్రయివేటీకరణ జరుగుతుందని తాము హెచ్చరించామని ఆయన గుర్తు చేశారు. తాజా పరిణామం దానికి నిదర్శనమనీ, ఇది ఆరంభం మాత్రమేనని ఆయన ట్వీట్ చేశారు. వన్ అధినయం చట్టంలోని సెక్షన్ 3సీ కేంద్రానికి ప్రత్యేక అధికారాలను కల్పించింది. పార్లమెంటు అనుమతి లేకుండానే కేంద్రం ఆదేశాలు, సవరణలు చేయొచ్చు. దీంతో తాజా నిర్ణయం సర్వత్రా తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది. దేశంలోని అడవుల పరిరక్షణ, జీవవైవిధ్యం, వన్యప్రాణుల భద్రత.. ఇవన్నీ దేశ భవిష్యత్‌కు చాలా కీలకం. కానీ కేంద్రంలోని మోడీ సర్కారు అవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నది. తాజా నిర్ణయం పర్యావరణ పరిరక్షణను తాకట్టు పెట్టి పరిశ్రమలకు ప్రయోజనాలను అందిస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు భారత అటవీ విధానాన్ని ఏ దిశగా తీసుకెళ్లాయోనన్న భయాన్ని వారు వెలిబుచ్చుతున్నారు.
ఈ మార్పునకు కారణం?
అటవీ సలహా కమిటీ గతనెల డిసెంబర్ 2న సమావేశమైంది. దేశంలో కాగితం, పల్స్, పేపర్‌బోర్డు దిగుమతులు భారీగా పెరిగాయని పేర్కొన్నది. 2024-25లో కాగితం దిగుమతులు 2.05 మిలియన్ టన్నులకు చేరగా.. 2020-21లో అవి 1.08 మిలియన్ టన్నులే. ఈ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ‘క్షీణించిన అడవీ ప్రాంతాల్లో’ తోటలు అవసరమని కమిటీ అభిప్రాయపడింది. అందుకే రాష్ట్ర అటవీ శాఖలు రూపొందించే వర్కింగ్ ప్లాన్ లేదా మేనేజ్‌మెంట్ ప్లాన్ ఆధారంగా ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యంతో తోటలు ఏర్పాటు చేయడాన్ని అనుమతించింది. ఈ తోటలను అటవీ కార్యకలాపాలుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.



